7 నగరాల్లో జోరందుకున్న ఇండ్ల అమ్మకాలు

7 నగరాల్లో జోరందుకున్న ఇండ్ల అమ్మకాలు

రియల్ ఎస్టేట్ రంగానికి మళ్లీ మంచి రోజులు వస్తున్నాయి. నగరాల్లో ఇండ్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా దేశంలోని 7 నగరాల్లో ఇండ్లకు డిమాండ్ బాగా పెరిగినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం నుంచి బయటపడటం, భవిష్యత్తులో రేట్లు మరింత పెరిగే అవకాశముందన్న అంచనాలు జనం ఇండ్ల అమ్మకాల వైపు మొగ్గుచూపేందుకు కారణమని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

2022 డిసెంబర్ నాటికి ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, ఫుణె నగరాల్లో ఇండ్ల అమ్మకాలు జోరందుకున్నాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ ప్రకటించింది. దీనికి సంబంధించి ఓ నివేదిక విడుదల చేసింది. దేశంలోని ఈ 7 నగరాల్లో మొత్తం 2,15,000 యూనిట్ల ఇండ్ల అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి విక్రయాలు 85శాతం ఎక్కువ కావడం విశేషం.  

ఉద్యోగాల్లో స్థిరపడటం, సిటీ లైఫ్ కు అలవాటుపడటమే నగరాల్లో ఇండ్ల అమ్మకాలు పెరిగేందుకు కారణమని నిపుణులు అంటున్నారు. గతంలో రూ.50 లక్షలు ఉన్న ఒక ఫ్లాట్ ధర, 2022లో రూ.72 లక్షలకు పెరిగింది. 2025కల్లా ఒక ఫ్లాట్ ధర రూ. 1.5 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూస్తే 2023లో రెసిడెన్షియల్ మార్కెట్ రేట్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.