
- తగ్గిన ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు
- పోయినేడు ఆదాయ లక్ష్యం చేరుకోని రిజిస్ట్రేషన్ల శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గత ఆర్థిక సంవత్సరం (2024–25) రియల్ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది. ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోళ్లు తగ్గాయి. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. 2024–-25లో రూ.18,229 కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా, రూ.14,307 కోట్లు మాత్రమే వచ్చాయి. టార్గెట్‌తో చూస్తే 27 శాతం ఆదాయం పడిపోయింది. ఇక పోయినేడాది (2023–24) వచ్చిన ఆదాయంతో చూస్తే 2% తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ (2025–26) కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో లేవు. రిజిస్ట్రేషన్ల శాఖకు ఏప్రిల్‌లో రూ.1,126 కోట్ల ఆదాయం రాగా, ఈ నెలలో రూ.1,250 కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న ప్రతికూల వాతావరణంతో ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల కొనుగోలుపై జనం ఆసక్తి చూపడం లేదని నిపుణులు అంటున్నారు. మార్కెట్‌లో స్థిరత్వం లేకపోవడం, భవిష్యత్ లాభాలపై నమ్మకం తగ్గడం వంటివి కొనుగోళ్లు తగ్గడానికి ప్రధాన కారణమని అంటున్నారు.రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత బలోపేతం చేయా ల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. లేదంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే క్రమంగా భూముల ధరలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చ రిస్తున్నారు.
తగ్గిన రిజిస్ట్రేషన్లు..
వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లు 2023-–24తో పోలిస్తే 2024–-25లో భారీగా తగ్గాయి. గతంలో ఈ రెండు కేటగిరీల్లో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టేవారు. కానీ ఈసారి కొనుగోళ్లు తగ్గడంతో రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పడిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు వచ్చే ఆదాయం కూడా పోయినేడాదితో పోలిస్తే తగ్గిపోయింది. కేటగిరీల వారీగా చూస్తే ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో రాబడి పడిపోయింది. ఓపెన్ ప్లాట్ల కింద 98 వేల డాక్యుమెంట్లు తగ్గాయి. దీంతో ఆదాయం కూడా పోయినేడాది కంటే రూ.430 కోట్లు తగ్గి రూ.3,113 కోట్లు మాత్రమే వచ్చింది. ఇక వ్యవసాయ భూముల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అగ్రి ల్యాండ్ సేల్ డాక్యుమెంట్లు 31,400 తగ్గాయి. దీంతో ఆదాయం కూడా 2023–24తో పోలిస్తే రూ.112 కోట్లు పడిపోయి రూ.1,517 కోట్లు మాత్రమే వచ్చింది. మరోవైపు ఇండ్ల అమ్మకాలు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాకపోయినప్పటికీ.. 2023–24తో పోలిస్తే కొంత పెరిగింది. ఇండ్ల రిజిస్ట్రేషన్లు 36,191 పెరిగాయి. దీంతో ఆదాయం రూ.64.23 కోట్లు (1.90 శాతం) పెరిగి రూ.3,441 కోట్లకు చేరుకుంది. ఫ్లాట్ల విషయానికొస్తే 731 డాక్యుమెంట్లు తగ్గినప్పటికీ.. ఆదాయం మాత్రం రూ.234 కోట్లు పెరిగి రూ.4,589 కోట్లు వచ్చింది. కాగా, హెచ్ఎండీఏ పరిధిలో డాక్యుమెంట్ల సంఖ్య తగ్గింది. 2023-–-24లో 4,40,931 కాగా.. 2024-–-25లో 4.35 లక్షలకు పడిపోయాయి. నాన్హెచ్ఎండీఏలో 25 వేల మేర డాక్యుమెంట్లు తగ్గాయి.
తగ్గిన రియల్ బూమ్..
రాష్ట్రంలో దాదాపు 20 నెలలుగా రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్‌లోనే నడుస్తున్నది. 2023 ఎన్నికల టైమ్ నుంచి రియల్ బూమ్ తగ్గింది. ఎలక్షన్లకు నాలుగైదు నెలల ముందు నుంచి ఎప్పుడూ ఇలాంటి పరిస్థితే ఉంటుంది. అయితే ఆ తర్వాత పరిస్థితి కుదు టపడుతుంది. కానీ ఈసారి రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు. మార్కెట్డౌన్ ఉన్నప్పటికీ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు ఏమాత్రం తగ్గలేదు. ఆర్థిక అనిశ్చితి, అధిక ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల పెంపు వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందని.. అది రియల్ ఎస్టేట్‌పై ప్రభావం చూపిందని నిపుణులు అంటున్నారు.
ఒక్క జులైలోనే టార్గెట్ రీచ్..
రిజిస్ట్రేషన్ల శాఖకు 2023–-24లో రూ. 14,558 కోట్ల ఆదాయం రాగా, 2024-–25లో రూ.14,307 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే రూ.251 కోట్లు తగ్గింది. ఆ శాఖ పెట్టుకున్న లక్ష్యంతో చూస్తే మాత్రం దాదాపు రూ.4 వేల కోట్లు పడిపోయింది. ఇక పోయినేడాది ఒక్క జులైలో మినహా ఏ నెలలోనూ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జులైలో రూ.1,454 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, రూ.1,639 కోట్ల ఆదాయం సమకూరింది.
2024 - 25లో నెలలవారీగా టార్గెట్, వచ్చిన ఆదాయం (రూ.కోట్లలో)
నెల టార్గెట్ ఆదాయం
ఏప్రిల్ 1,281 1,115
మే 1,546 1,079
జూన్ 1,546 1,293
జులై 1,454 1,639
ఆగస్టు 1,454 1,307
సెప్టెంబర్ 1,454 858
అక్టోబర్ 1,546 1,120
నవంబర్ 1,546 1,160
డిసెంబర్ 1,454 1,105
జనవరి 1,454 988
ఫిబ్రవరి 1,637 1,203
మార్చి 1,859 1,440
మొత్తం 18,229 14,307