
హైదరాబాద్, వెలుగు: విపరీతంగా పెరుగుతున్న స్టీల్, సిమెంట్, అల్యూమినియం ధరలను తగ్గించాలనే డిమాండ్‌తో ఈ నెల 4వ తేదీన పనులను నిలిపివేస్తామని రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రకటించాయి. ముడిసరుకు ధరలు 45 శాతం వరకు పెరగడం వల్ల ప్రాపర్టీల ధరలు కనీసం 10–15 శాతం పెరగవచ్చని కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్), తెలంగాణా రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా), తెలంగాణా బిల్డర్స్ ఫెడరేషన్ (టీబీఎఫ్), తెలంగాణా డెవలపర్స్ అసోసియేషన్ (టీడీఏ)లు తెలిపాయి. ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతున్నదని, క్యాష్‌ఫ్లోలు తగ్గుతున్నాయని ఈ సంఘాల మెంబర్లు చెప్పారు. దాదాపు 600 మందికి పైగా డెవలపర్లు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సవాళ్లను అధిగమించడానికి అందుబాటులోని మార్గాల గురించి శుక్రవారం నిర్వహించిన మీటింగులో చర్చించామని ఈ సంఘాల సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ పి. రామకృష్ణారావు మాట్లాడుతూ ‘‘ కరోనా కష్టాలు తగ్గుతున్న సమయంలోనే యుద్ధం మొదలైంది. ఖర్చులు భరించరాని స్థితికి చేరాయి. మాకున్నవి రెండే మార్గాలు. ధరలు కొద్దిగా తగ్గే వరకూ వేచి చూడడం లేదా ప్రాజెక్ట్‌లను కొనసాగించి పెరిగిన ధరల ప్రకారం అమ్మడం. రెండోది చేస్తే ప్రాపర్టీల ధరలను 10–15 శాతం వరకు పెంచాల్సి ఉంటుంది’’అని అన్నారు.