
- స్వరాష్ట్ర పోరు దివిటీపై సర్కారు వివక్ష ఎందుకు?
- ఆంధ్రా యాజమాన్య పత్రికలపై సర్కారుకు అంత ప్రేమెందుకు?
- ఆ రెండు పత్రికలకే ప్రకటనలెందుకు ఇస్తున్నట్టు !
- మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారిన యాడ్స్
హైదరాబాద్: తెలంగాణ ప్రజల గొంతుక వీ6, వెలుగు. ఆత్మగౌరవ పోరాటంలో ముందు నడిచిన ఉద్యమ దివిటీ. యాసను, భాషను, పోరాట పటిమను సుసంపన్నం చేసిన ఘనత వీ6 సొంతం. తెలంగాణ మట్టి పరిమళాలను ప్రపంచానికి చాటిన వీ6.. మలిదశ పోరులో నిత్య నిర్బంధాలను ఛేదించుకొని ముందుకు ఉరికిన టార్చ్ బేరర్. అలాంటి వీ6, వెలుగుకు కాంగ్రెస్ సర్కారులో అడ్డుపడుతున్నదెవరు..? ప్రకటనలు రాకుండా అడ్డుకుంటున్నదెవరు..? అన్నది మీడియా సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారింది. మలిదశ ఉద్యమ సమయంలో, పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలే శ్వాసగా, ప్రజా సమస్యలే ఎజెండాగా నడిచిన, నడుస్తున్న మీడియా సంస్థ వీ6, వెలుగు. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నుంచి స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వరకు నిత్య నిర్బంధాలతోనే ప్రజల గొంతుకగా నిలుస్తన్నది. ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ మీడియా గొంతు నొక్కే ప్రయత్నంలో అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వలేదు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం వెలుగు పత్రికను మొగ్గలోనే తుంచేయాలనే ధోరణితో వ్యవహరించింది. అక్రిడిటేషన్లను జారీ చేయలేదు. దీంతో జర్నలిస్టులు పోరాడి అక్రిడిటేషన్లను సాధించుకున్నారు. బీఆర్ఎస్ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు ఏకంగా వెలుగు పత్రిక, వీ6 చానల్ పై బ్యాన్ విధించింది. ప్రగతి భవన్ దరిదాపుల్లోకి కూడా వీ6, వెలుగు జర్నలిస్టులను రానీవ్వలేదు. అక్కడి నుంచి ఘోరంగా అవమానించి బయటికి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
గత సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల గొంతుకై నిలిచింది వీ6 చానల్, వెలుగు దినపత్రిక. అలాంటి వీ6, వెలుగుపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపుతుండటం మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ యాజమాన్యంతో నడిచే పత్రికకన్నా ఆంధ్రా యాజమాన్య పత్రికలకు పెద్ద పీట వేస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
కొత్తకార్డుల వేళ కొత్త పంథా
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీకి సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రెండు ఆంధ్రా యాజమాన్య పత్రికలకు ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఈ రెండు పత్రికలు తెలంగాణ కోసం ఎన్నడూ పనిచేయలేదు. కీలక సందర్భంలో ఆంధ్రా రాగం అందుకునే ఈ రెండు పత్రికలకే ప్రకటనలు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో పాటు బీఆర్ఎస్ కీలక నేతలు డైరెక్టర్లు ఆ ఉన్న మరో పత్రికకూ ప్రకటనల జాతర చేస్తున్నారు.
కారణమేంటంటే ఆ పత్రిక ఎడిటర్ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిశాడట. అందుకే గేట్లు ఖుల్లా అయినయ్.. సదరు ఎడిటర్ ఏపీలోలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సలహాదారుగా కూడా వ్యవహరించారు. కొందరు సర్కారు పెద్దలకు ఆయనో మీడియా లెజెండ్ అనే భావన ఉంటే ఉండొచ్చు. ఆ పత్రిక లైన్ ప్రభుత్వానికి విరుద్ధంగా ఉంటోంది. ఇప్పటికీ ఆ పత్రికలో ఇప్పటికీ గులాబీ వాసనలు గుబాళిస్తున్నాయి.
వివాదాస్పదంగా సమాచార శాఖ తీరు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనల విషయం వివాదాస్పదమవుతోంది. పత్రికలు , అవి అనుసరిస్తున్న విధానాలను చూడకుండా ప్రకటనలు జారీ చేసి తెలంగాణ ప్రజాధనాన్ని ఆంధ్రా యాజమాన్య మీడియా సంస్థలకు అప్పనంగా కట్టబెట్టడం విమర్శలకు కారణమవుతోంది. నిర్బంధాలు, అవమానాలు ఎదుర్కొన్న వీ6, వెలుగును పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక ఎవరున్నారు..? ఎందుకలా జరుగుతోందనేది హాట్ టాపిక్ గా మారింది.