- రెబల్స్ నామినేషన్ల ఉపసంహరణకు సహకరించాలి
- క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి పొత్తులు : మంత్రి కొండా సురేఖ
ఖమ్మం టౌన్, వెలుగు : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. ఖమ్మం నగరంలోని సంజీవరెడ్డి భవన్‌లో జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌తో కలిసి ఆదివారం మీడియాతో మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల్లో గుర్తు లేకున్నా ఎక్కువ మంది క్యాండిడేట్లు గెలిచారని గుర్తు చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి కోసం ముందుకు సాగుతున్నట్లు చెప్పారు.
మున్సిపాలిటీల్లో రెబెల్స్ సమస్య లేకుండా చూసుకోవాలని, నామినేషన్ల ఉపసంహరణకు రెబెల్స్ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సీపీఐతో పొత్తు కొనసాగిస్తున్నామని, వార్డుల్లో క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి వారి ఇష్టప్రకారం పొత్తులు ఖరారు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో పేదలకు రేషన్ కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండేదని, అందుకే ప్రజలు ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్‌కు జై కొట్టారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ.. ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. సమావేశంలో పట్టణ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మహిళా సంఘం అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.
