గొడ్డుచాకిరీ చేయించుకొని హక్కుల్లేవంటారా?.రేవంత్​రెడ్డి

గొడ్డుచాకిరీ చేయించుకొని హక్కుల్లేవంటారా?.రేవంత్​రెడ్డి
  • జాబ్​లోంచి తీసేస్తామనడం దిగజారుడుతనం 
  • జేపీఎస్​లను గ్రేడ్​4 ఉద్యోగులుగా గుర్తించాలె: రేవంత్​రెడ్డి

హైదరాబాద్, వెలుగు:  కేసీఆర్ పాలనలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్) పరిస్థితి బానిసల కన్నా హీనంగా మారిందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారితో గొడ్డు చాకిరీ చేయించుకోవడం తప్ప వాళ్ల హక్కులను పరిరక్షించడంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఫైర్ అయ్యారు. జేపీఎస్​లను సర్కార్ బెదిరించడంపై మంగళవారం ఆయన సీఎం కేసీఆర్​కు బహిరంగ లేఖ రాశారు. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల్లోంచి తీసేస్తామని బెదిరిం‑------చడం సర్కారు దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. వారికి దక్కాల్సిన హక్కులపై 11 రోజులుగా సమ్మె చేస్తున్నా సర్కారుకు చీమకుట్టినట్టయినా లేదన్నారు. ‘‘దేశంలోనే తెలంగాణ పంచాయతీలు ఆదర్శమని, కేంద్రం అవార్డులిస్తున్నదని మీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. ఆ గొప్పల వెనక జేపీఎస్​ల శ్రమ ఉంది. వారి కష్టంతోనే పంచాయతీలకు 79 అవార్డులు వచ్చాయి. అవార్డులు తెచ్చిన వాళ్ల సర్వీసులను రెగ్యులరైజ్ చేయకుండా మీ సర్కార్​ ఇస్తున్న రివార్డ్ వేధింపులా?’’ అని మండిపడ్డారు.

తెలంగాణ వస్తే కాంట్రాక్ట్​, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలనేవి ఉండవంటూనే.. వారితో 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మూడేండ్ల ప్రొబేషన్ పీరియడ్​తో సర్కారు వెట్టిచాకిరీ చేయిస్తున్నదన్నారు. వారి ప్రొబేషన్​ 2022 ఏప్రిల్​11న పూర్తయిందని, వారిని రెగ్యులర్​ చేయకుండా ప్రొబేషన్​నే మరో ఏడాది పెంచారని విమర్శించారు. ఆ పెంచిన ప్రొబేషన్ పీరియడ్ కూడా గత నెలలోనే ముగిసిందని, అయినా సర్కారులో ఎలాంటి చలనం లేదని ఆరోపించారు.

రోజు 56 రకాలు విధులు నిర్వర్తిస్తున్నరు

జేపీఎస్​లు రోజూ 10 నుంచి 12 గంటల పాటు 56 రకాల విధులను నిర్వహిస్తున్నారని రేవంత్ లేఖలో పేర్కొన్నారు. రోజు వారీ బాధ్యతలు పెరుగుతుండడం, మితిమీరిన పని ఒత్తిడితో చాలా మంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికే స్థానిక రాజకీయ ఒత్తిళ్లు భరించలేక దాదాపు 1,500 మంది ఉద్యోగాలు వదిలేశారన్నారు. ఆరోగ్య సమస్యలతో 44 మంది వరకు మృతిచెందారన్నారు. జేపీఎస్​ల పోరాటానికి కాంగ్రెస్​ పూర్తి మద్దతునిస్తున్నదని, జేపీఎస్​లను వెంటనే రెగ్యులరైజ్​ చేయాలని డిమాండ్​ చేశారు.

‘‘నాలుగేండ్ల సర్వీసును పరిగణనలోకి తీస్కోవాలి. 010 పద్దు కింద వేతనాలిస్తూ ఈహెచ్​ఎస్​ కార్డులను అందజేయాలి. చనిపోయిన పంచాయతీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఔట్​సోర్సింగ్ సెక్రటరీలనూ రెగ్యులర్ చేయాలి. మహిళా జేపీఎస్​లకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్​ కేర్ సెలవులు ఇవ్వాలి’’ అని డిమాండ్​ చేశారు.