హైదరాబాద్, వెలుగు: కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. సెలెక్టయిన అభ్యర్థులకు మెడికల్ టెస్ట్‌లు నిలిపివేయాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బోర్డ్ చైర్మన్ వీవీ శ్రీనివాస్ రావు పోలీస్ కమిషనర్లకు, జిల్లా ఎస్పీలకు మెసేజ్ పంపించారు. కోర్టు నుంచి తదుపరి ఆదేశాల వచ్చేదాకా మెడికల్ టెస్ట్‌ల ప్రక్రియ నిర్వహించవద్దని సూచించారు. మెయిన్స్‌లో 122, 130, 144 వ ప్రశ్నలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశారని, 57వ ప్రశ్న తప్పుగా ఉందని పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు ఈ నెల 9న తీర్పు వెల్లడించింది. తుది పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించాక మళ్లీ వాల్యుయేషన్ చేయాలని బోర్డును ఆదేశించింది. ఆపై అర్హులైన వారితో ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేయాలని పేర్కొంది. ఈ క్రమంలోనే గురువారం నిర్వహించాల్సిన మెడికల్ టెస్ట్‌లను బోర్డ్ నిలిపివేసింది.

