
- ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్‌కు రెడ్ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పలు చోట్ల మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. చాలా చోట్ల నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని, కరెంట్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తుతాయని, రవాణాకు ఆటంకం ఏర్పడుతుందని తెలిపింది. ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఓల్డ్ కొత్తగూడెంలో 19.98, సీతారాంపురంలో 18.8, గరిమెల్లపాడులో 18.8, వరంగల్ రూరల్‌లోని సంగెంలో 18.7, చెన్నారావుపేటలో 16.6 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది.