లాక్‌డౌన్ రిలాక్సేషన్స్​తో తగ్గిన రద్దీ

లాక్‌డౌన్ రిలాక్సేషన్స్​తో తగ్గిన రద్దీ
  • హడావుడి లేకుండా నిత్యావసరాల కొనుగోళ్లు
  • మార్కెట్లు, దుకాణాల దగ్గర కనిపించని రష్
  • ఒంటి గంట వరకు టైమ్ పెంచడంతో సంతోషం వ్యక్తం చేసిన వ్యాపారులు 
  • మెట్రో ట్రైన్ సేవలను పరిశీలించిన సీఎస్ 

హైదరబాద్, వెలుగు: లాక్​డౌన్ రిలాక్సేషన్స్​తో సిటీజనం కూడా రిలాక్స్ అయ్యారు. ఒంటిగంట వరకు టైమ్ పెంచడంతో మార్కెట్లు, నిత్యావసరాల షాపుల దగ్గర  సోమవారం అంతగా రద్దీ కనిపించలేదు. అంతకుముందు రోజు వరకు సూపర్ మార్కెట్లు, రైతు బజార్లు, టీకొట్లు, టిఫిన్ సెంటర్లూ, కూరగాయల షాపులు ఇలా రోడ్లపై ఎక్కడ చూసినా హడావుడి వాతావరణమే కనిపించేది. ఉదయం 10 తర్వాత లాక్ డౌన్ ఉండటంతో  కొంచెం ఆలస్యమైనా వెహికల్స్ సీజ్ చేస్తారనే భయంతో సిటీ జనం  కంగారుగా పనులు ముగించుకునే వారు. ఒకేసారి కస్టమర్లు ఎగబడటంతో వ్యాపారులు కూడా సరిగా బిజినెస్ చేసుకోలేకపోయారు.  సోమవారం నుంచి లాక్ డౌన్  సడలింపుల టైమ్​ను ఒంటిగంట వరకు పెంచడంతో ఉదయం 6 గంటలకే రోడ్ల మీద కనిపించే సిటీ జనం 9 దాటినా బయటకు రాలేదు. ఉదయమే గిరాకీకి అలవాటు పడ్డ చిరు వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో కొంచెం టెన్షన్ పడ్డారు.  కానీ జనం మెల్లగా రావడంతో 4 గంటల రిలాక్సేషన్ కంటే ప్రస్తుతం వ్యాపారం బెటర్ అయ్యిందని కూరగాయలు, టీ కొట్లు, టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్ల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.

కస్టమర్ల రద్దీ తగ్గడంతో రిలాక్స్​గా బిజినెస్ చేసుకున్నామని చెప్తున్నారు. మొత్తానికి లాక్ డౌన్ రిలాక్సేషన్ టైమ్ పొడిగింపుతో అటు నగరవాసులు, ఇటు వ్యాపారులు చాలా వరకు రిలాక్స్ అయ్యారు. రోడ్ సైడ్​ చిరు వ్యాపారులు, స్ట్రీట్ వెండర్స్ కు కూడా ఈ టైమ్ కలిసి వచ్చింది. ఇప్పుడిప్పుడు తమకు కూడా గిరాకీ అవుతోందని వారు చెప్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి స్ట్రిక్ట్ గా లాక్ డౌన్ ను అమలు చేశారు. అయితే ఎంత టైమిచ్చినా జనం తీరు మాత్రం మారలేదు. ఇండ్లకు చేరేందుకు ఒంటి గంట నుంచి 2 వరకు టైమ్ ఇచ్చినా చాలా మంది రోడ్లపైనే ఉండి పోలీసుల కంటబడ్డారు. దీంతో చాలా చోట్ల పోలీసులు వెహికల్స్ ను ఆపి వాహనదారులను మందలించి పంపించేశారు.

ఏరియాల వారీగా..
కూకట్​పల్లి, మియాపూర్ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఉదయం రద్దీ తక్కువగా ఉంది. ఉదయం 9 గంటల తర్వాత రోడ్ల మీద రద్దీ పెరిగింది. వ్యాపారులు ఉదయం నుంచే షాపులు తెరిచినప్పటికీ జనం మాత్రం నెమ్మదిగా  బయటకు వచ్చారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్యలో మాత్రమే రోడ్ల మీద వెహికల్స్ రద్దీ ఉంది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. మొత్తం మీద లాక్​డౌన్ సడలింపుల టైమ్ పెంచడం వల్ల జనం ఎలాంటి హడావుడి లేకుండా పనులు ముగించుకుని ఇండ్లకు చేరుకున్నారు. సడలింపు టైమ్ పెంచటం వల్ల దాని ఎఫెక్ట్ రిస్క్ టేకర్స్ వ్యాక్సినేషన్ సెంటర్ల వద్ద కనిపించింది. రిస్క్ టేకర్స్ కు పనులు చేసుకునేందుకు టైమ్ దొరకడంతో వ్యాక్సిన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు.  దీంతో వారి కోసం ఏర్పాటు చేసిన పలు వ్యాక్సినేషన్ సెంటర్లు ఖాళీగా కనిపించాయి.  మధ్యాహ్నం 2 గంటల తర్వాత  హాస్పిటల్స్​లో ట్రీట్ మెంట్, వాక్సిన్, కరోనా టెస్ట్ కోసం రాకపోకలు సాగించిన వారు ఉన్నారు. ఖైరతాబాద్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వెహికల్స్ రద్దీ తక్కువగా కనిపించింది. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నోళ్లు, మినహాయింపు  కేటగిరీకి చెందిన వాళ్లు మాత్రమే రాకపోకలు సాగించారు.  ముషీరాబాద్, పద్మారావునగర్, అఫ్జల్​ గంజ్​   ఇలా సిటీలోని పలు ఏరియాల్లో ఎక్కడ చూసినా పెద్దగా జనాల రద్దీ కనిపించలేదు. వనస్థలిపురం మార్కెట్ లో ఆదివారం వరకు ఉదయం 8 నుంచి 9 మధ్యలో ఫుల్ రష్ కనిపించేది. సోమవారం అక్కడ జనం రద్దీ తగ్గింది. శంషాబాద్ పరిధిలోని ఏరియాల్లోనూ ఇదే తీరు కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డు పూర్తిగా ఖాళీగా మారిపోయింది. టికెట్లు ఉన్న ప్యాసింజర్స్ వెహికల్స్​  తప్ప మిగతావి  ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో కనిపించలేదు.

నేటి నుంచి ట్రాన్స్ పోర్టు టైమ్​ను పెంచనున్న మెట్రో, ఆర్టీసీ
సిటీలో రవాణా సేవల సమయాన్ని ఆర్టీసీ, మెట్రో అధికారులు మంగళవారం నుంచి పొడిగించనున్నారు. నేటి నుంచి ఉదయం 6.30 గంటల నుంచి ఆర్టీసీ సేవలు మొదలు కానుండగా.. 7 గంటలకు మెట్రో ట్రైన్స్  ప్రారంభమవుతాయి.  మధ్యాహ్నాం ఒంటి గంట వరకు మెట్రో, ఆర్టీసీ సేవలు నడవనున్నాయి.  సోమవారం ఉదయం మెట్రో సేవలను  సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎం.ఆర్.హెచ్.ఎల్ మేనేజింగ్ డైరెక్టర్  కె.వి.బి. రెడ్డితో కలిసి ఖైరతాబాద్ స్టేషన్ నుంచి అమీర్ పేట స్టేషన్ వరకు ట్రైన్​లో సీఎస్ జర్నీ చేశారు. కరోనా రూల్స్ అమలు తీరును పరిశీలించారు. మెట్రో సేవలు, భద్రతా చర్యలు గురించి ప్యాసింజర్లను అడిగి తెలుసుకున్నారు. ఆఫీసులు, వ్యాపారాలు మూసివేసిన తర్వాత ఇంటికి చేరుకునేలా మెట్రో టైమింగ్​ను పొడిగించాలని ప్యాసింజర్లు సీఎస్ ను కోరారు. ఈ సందర్భంగా మెట్రో సేవలను మరో గంటకు పైగా పొడిగించాలని అధికారులకు సీఎస్ సూచించారు. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తో ప్రతి రూట్​లో సోమవారం చివరి ట్రైన్ ఉదయం 11.45 గంటలకు బయలుదేరింది. మంగళవారం నుంచి మధ్యాహ్నం 1 గంటకు స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరి మధ్యాహ్నం  2 గంటలకు గమ్యస్థానానికి చేరుకునేలా మెట్రో అధికారులు సర్వీసులను నడపనున్నారు. మెట్రో ట్రైన్ ప్యాసింజర్లకు అందిస్తున్న సేవలు, భద్రతా ఏర్పాట్లపై మేనేజింగ్ డైరెక్టర్లను సీఎస్ అభినందించారు. మెట్రో బాటలోనే గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ సేవలు నడవనున్నాయి. ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు చివరి బస్సులు అందుబాటులో ఉంటాయని గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. అదేవిధంగా బస్ పాస్ కౌంటర్లు కూడా పనిచేస్తాయన్నారు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు టీకా పూర్తయ్యిందని, పొడిగించిన టైమింగ్​కు అనుగుణంగా పనివేళల్లో   మార్పులు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశామన్నారు.