కేబినెట్ లో మాదిగలకు అన్యాయం..TRS సీనియర్ల అసంతృప్తి

కేబినెట్ లో మాదిగలకు అన్యాయం..TRS సీనియర్ల అసంతృప్తి
  • 12 శాతం ఉన్న మాదిగలను పక్కనబెట్టుడేంది?
  • గువ్వలకు విప్​ పదవి ఇస్తే మాదిగలకు మంత్రి పదవి ఇచ్చినట్లా? అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగురాష్ట్ర కేబినెట్​ కూర్పుపై కొందరు టీఆర్​ఎస్​ సీనియర్​ నేతలు మొదలు.. ఇటీవల కాంగ్రెస్​ నుంచి వచ్చి పార్టీలో చేరివారు కూడా బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అసెంబ్లీ లాబీలో పలువురు నేతలు ఈ అంశంపై మీడియాతో చిట్​చాట్​  చేశారు. కేబినెట్​లో మాదిగలకు అన్యాయం జరిగిందని, ఇది బాధాకరమని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. రాష్ట్రంలో 12 శాతం మాదిగలు ఉన్నారని, వారిని పక్కనపెట్టడం ఏమిటో అని వ్యాఖ్యానించారు. మాదిగలకు జరిగిన ఈ అన్యాయం గురించి ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే  బాగుండేదని, ప్రతిపక్షాలు మాట్లాడితే రాజకీయం చేస్తున్నారని విమర్శిస్తారని ఆయన అన్నారు. దీనిపై ఎమ్మార్పీఎస్​ వాళ్లు  మాట్లాడక తప్పదని, ఇంకా ఎవరైనా మాట్లాడితే బాగుంటుదని సూచించారు. మంత్రివర్గంలోకి మాదిగలను తీసుకోకపోవడం తప్పుడు సంకేతాలను తీసుకెళ్తుందన్నారు. గువ్వల  బాలరాజుకు విప్ పదవి ఇచ్చినంత మాత్రాన మాదిగలకు మంత్రి పదవి ఇచ్చినట్టు కాదని రాజయ్య స్పష్టం చేశారు.

12 మంది వస్తే ఒక్కటే మంత్రి పదవా: గండ్ర

కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో కలిస్తే ఒక్కరికే మంత్రి పదవి ఇస్తారా? అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. మరొకరికి మంత్రి పదవి ఇస్తే బాగుండేదని అన్నారు. గండ్ర జ్యోతికి జిల్లా పరిషత్ చైర్​పర్సన్​ పదవి ఇచ్చారు కదా ఇంకా ఏం కావాలి అని మీడియా  ప్రశ్నించగా..  ‘అది వేరు ఇది వేరు’ అని ఆయన పేర్కొన్నారు.

జైల్లో పెట్టించినోళ్లకు మంత్రి పదవా?

సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై హైదరాబాద్​కు చెందిన ఓ సీనియర్​ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో సబిత హోంమంత్రి హోదాలో ఉండి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారని ఆయన గుర్తుచేశారు. ‘‘అప్పట్లో మమ్మల్ని అరెస్టులు చేయించి.. రాత్రిళ్లు స్టేషన్లో కూర్చో పెట్టిన సబితకు ఇప్పుడు మంత్రి పదవి  ఇవ్వడం ఏంది?” అని సదరు ఎమ్మెల్యే ప్రశ్నించారు. పార్టీలో మొదట్నుంచీ ఉన్న పద్మా దేవేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా.. నిన్నగాక మొన్న పార్టీలోకి రాగానే సబితకు ఇవ్వడం సరికాదన్నారు.

పెద్ద కాపులకు పెద్ద కుర్చీలు: గుత్తా

మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి తనదైన శైలిలో మాట్లాడారు. లాబీలో కనపడిన ఆయనను.. ‘‘కాబోయే మండలి చైర్మన్ కు కంగ్రాట్స్’’ అంటూ అక్కడున్న నేతలు విష్ చేశారు. అప్పుడు గుత్తా స్పందిస్తూ.. ‘‘పెద్ద కాపులకు సార్ పెద్ద కుర్చీలు ఇచ్చారు” అని వ్యాఖ్యానించారు.  మరి పార్టీలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ ఏమైందని ఆయనను మీడియా అడుగగా.. ‘‘ఏమో చూద్దాం” అంటూ వెళ్లిపోయారు