IND vs ENG 2025: DSP సరిపోదు అంతకు మించిన ప్రమోషన్ సిరాజ్‌కు కావాలి: రవిశాస్త్రి

IND vs ENG 2025: DSP సరిపోదు అంతకు మించిన ప్రమోషన్ సిరాజ్‌కు కావాలి: రవిశాస్త్రి

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. ఓవల్ వేదికగా ఇంగ్లాండ్ తో సోమవారం (ఆగస్టు 4) ముగిసిన టెస్టులో టీమిండియాకు సంచల విజయాన్ని అందించడమే ఇందుకు కారణం. ఐదో రోజు ఇండియా విజయానికి 4 వికెట్లు కావాల్సిన దశలో ఈ హైదరాబాదీ పేసర్ మ్యాజిక్ చేశాడు. లోయర్ ఆర్డర్ ను చక చక ఔట్ చేసి ఓడిపోయే మ్యాచ్ లో ఇండియాకు విజయాన్ని అందించాడు. సిరాజ్ అద్భుత స్పెల్ తో ఇంగ్లాండ్ తో సిరీస్ ను ఇండియా 2-2 తేడాతో సిరీస్ ను సమం చేసింది.  

ALSO READ | బుమ్రా ఆల్ టైమ్ రికార్డ్ సమం: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన మహ్మద్ సిరాజ్

స్టన్నింగ్ కంబ్యాక్ ఇచ్చి టీమిండియాను గెలిపించిన సిరాజ్ పై  టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. 'సిరాజ్ ఇకపై డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు. అతనికి అంతకు మించిన ఉన్నత పదోన్నతి లభిస్తుంది". అని శాస్త్రి అన్నారు. టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 9 వికెట్లు తీసుకున్న సిరాజ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఓవరాల్ గా ఈ సిరీస్ లో సిరాజ్ తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 32.43 సగటుతో 23 వికెట్లు పడగొట్టి, సిరీస్‌ను అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా నిలిచాడు. ఈ పర్యటనలో ఐదు టెస్టుల్లోనూ ఆడిన ఏకైక భారత పేసర్ కూడా సిరాజ్ కావడం విశేషం. 

2024 అక్టోబర్ లో సిరాజ్ కు రాష్ట్ర డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ)గా బాధ్యతలు స్వీకరించాడు. రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్‌కు రిపోర్ట్ చేసిన సిరాజ్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు.టీ20 ప్రపంచకప్ జట్టులో సభ్యుడైన మహ్మద్ సిరాజ్‌కు గ్రూప్-1 స్థాయి ఉద్యోగమిస్తామని గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాటిచ్చిన విషయం తెలిసిందే. ఒకవేళ పోలీసు శాఖలో చేరాలనుకుంటే డీఎస్పీ వంటి ఉన్నత పదవులలో నేరుగా ప్రవేశం కల్పిస్తుందని చెప్పారు.