
న్యూఢిల్లీ: ఆరు సంవత్సరాల క్రితం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడిపోయిన జమ్మూ కాశ్మీర్ మళ్లీ రాష్ట్ర హోదా దక్కించుకోనుందా..? రోజు రోజుకు పెరుగుతోన్న డిమాండ్ల మేరకు జమ్మూ కాశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యిందా..? అంటే న్యూఢిల్లీలో జరుగుతోన్న పరిణామాలు చూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కాగా, 2019, ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి.. జమ్మూ, లడక్ వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసింది.
2025, ఆగస్ట్ 5తో ఆర్టికల్ 370 రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతోంది. అయితే.. గత కొద్ది రోజులుగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్లు ఎక్కువ అయ్యాయి. జమ్మూ, లడక్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) పార్టీ కూడా రాష్ట్ర హోదా తిరిగి కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రోజురోజుకు ఈ తరహా డిమాండ్లు పెరుగుతుండటంతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని మోడీ సర్కార్ యోచిస్తోన్నట్లు తెలిసింది.
ALSO READ : కోహ్లీ తిరిగి రండి.. జట్టుకి ఇప్పుడు మీరు అవసరం: ఎంపీ శశిథరూర్
ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరుసగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. 2025, ఆగస్ట్ 3న ప్రధాని మోడీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. మోడీ సమావేశం పూర్తి అయిన వెంటనే అమిత్ షా వెళ్లి ద్రౌపది ముర్మును కలిశారు. సాధారణంగా ప్రెసిడెంట్ తో భేటీ అనంతరం.. ఆ సమావేశానికి సంబంధించిన విషయాలను మీడియాకు వెల్లడిస్తారు.
కానీ ప్రెసిడెంట్ ముర్ముతో మోడీ, అమిత్ షాల భేటీ వివరాలు మాత్రం బయటకు రాలేదు. దీంతో ఈ భేటీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సంబంధించేనని అధికార, మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించిన ఆగస్ట్ 5వ తేదీ ముందు.. ఒకేరోజు గంటల వ్యవధిలో ప్రధాని, హోంశాఖ మంత్రి ప్రెసిడెంట్‌తో భేటీ కావడంతో ఈ ప్రచారం నిజమేనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతోన్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో దీనిపై కేంద్రం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని ఇటు రాష్ట్రపతి భవన్ కానీ, అటు కేంద్ర ప్రభుత్వంగానీ ధ్రువీకరించలేదు.