బీహార్‎లో మళ్లీ మాదే పవర్ .. NDA 160కి పైగా సీట్లు గెలుస్తది: అమిత్ షా

బీహార్‎లో మళ్లీ మాదే పవర్ .. NDA 160కి పైగా సీట్లు గెలుస్తది: అమిత్ షా

న్యూఢిల్లీ: యావత్ దేశం మొత్తం బీహార్ అసెంబ్లీ ఎన్నికల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మళ్లీ విజయం సాధిస్తుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ఏకంగా 160కి పైగా సీట్లు సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. 2025, నవంబర్ 6న బీహార్‎లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ నేషనల్ మీడియా ఛానెల్‎కు మంగళవారం (నవంబర్ 4) అమిత్ షా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీహార్‎లో ఎన్డీఏ కూటమికి స్పష్టమైన విజయం లభిస్తుందని అంచనా వేశారు. ఎన్డీయే మూడింట రెండు వంతుల సీట్లు దక్కించుకుంటుందని నొక్కి చెప్పారు.

ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ స్ట్రైక్ రేట్ సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఆర్జేడీపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ ఇప్పటికీ లాఠీ ర్యాలీలు, కండబలం అనే అదే సిద్ధాంతంపై నడుస్తుందని ఆరోపించారు. ఆర్జేడీ గెలిస్తే బీహార్‎లో మళ్లీ జంగిల్ రాజ్యం వస్తుందని విమర్శించారు. గత 20 సంవత్సరాలుగా ఆర్జేడీ అధికారంలో లేకపోవడం వల్లే బీహార్ జంగిల్ రాజ్ నుంచి విముక్తి పొందిందని.. వాళ్లు గెలిస్తే ఏదో ఒక రూపంలో మళ్లీ అదే పాలన వస్తుందని ఆరోపించారు. 

ఆర్జేడీలో తేజస్వీ పాత్ర నామమాత్రమేనని.. ఇప్పటికీ లాలూ ప్రసాద్ యాదవే ఆ పార్టీ అధినేత అన్నారు. కాగా, బీహార్ లోని 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 2025, నవంబర్ 6న తొలి దశ, నవంబర్ 11న రెండో దశ పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న కౌంటింగ్ అదే రోజు ఫలితాలు విడుదల కానున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష మహఘాట్బందన్ కూటమి ఛాలెంజింగ్ తీసుకున్నాయి. మరీ బీహార్ ప్రజలు ఈసారి ఎవరికీ పట్టం కడతారో తెలియాలంటే మరో 10 రోజులు వేచి చూడాల్సిందే.