హైదరాబాద్: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాకపోతే 2025, నవంబర్ 11లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయినింగ్లో భాగంగా మంగళవారం (నవంబర్ 4) రెహమత్ నగర్లో సీఎం రేవంత్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు.. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. మరీ తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధం కాకపోతే ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి.. కేసీఆర్, హరీష్, కేటీఆర్‌ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్‌ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని.. ఇందులో మీ రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఏంటని ప్రశ్నించారు. లోపాయికారీ ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్‌లో బీజేపీ బీఆర్ఎస్కు పరోక్ష మద్దతు ఇస్తోందని.. ఎందుకంటే రాబోయే రోజుల్లో బీఆరెస్ బీజేపీలో విలీనం కాబోతుందని ఆరోపించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని నేను చెప్పడం లేదని.. స్వయంగా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడబిడ్డ కవితనే చెప్పిందని అన్నారు.
