ముగ్గురు ఆడపిల్లలు.. ఉన్నత విద్యను అభ్యసించారు.. కొద్దిరోజులైతే ఆ తల్లిదండ్రులను కూర్చోబెట్టి సాదుకునేవారు.. ఆడపిల్లలు కడుపులోనే చంపేస్తున్న రోజుల్లో, ముగ్గురు ఆడపిల్లలను పెంచి, పెద్ద చేసి, చదివించి చేతికి వచ్చే టైంకి ముగ్గురూ ఒకేసారి దూరం అవడం ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపుకోత.. ముగ్గురూ కలిసి ఒకేసారి ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోవడం నిజంగా జీర్ణించుకోలేని విషయం.. ఇంట్లో నుంచి ఒక పాడె కదిలితేనే ఇంటిల్లి పాది శోక సంద్రంలో మునిగిపోతుంది. అలాంటిది ముగ్గురు ఆడపిల్లలు.. ముగ్గురికీ ఇంచుమించు 20 ఏళ్ల వయస్సు.. ఒకే ఇంట్లో నుంచి.. ముగ్గురు మహాలక్ష్మిలు ఇలా ఒకేసారి పాడెపై తిరిగి రాని లోకానికి వెళుతుంటే.. ఆ ఇల్లే కాదు.. ఊరు ఊరంతా కన్నీళ్లు పెట్టింది.. ఆ విజువల్స్, ఫొటోలు అందర్నీ కదిలించి వేస్తున్నాయి.. మీరు ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం తల్లులూ అని సొంతూరు తుది వీడ్కోలు పలికింది. చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంతిమ యాత్రతో పెర్కంపల్లి గ్రామంలో కనిపించిన హృదయ విదారక దృశ్యం ఇది.
తాండూరు నియోజకవర్గం యాలాల మండలం పెర్కంపల్లికి చెందిన ఎల్లయ్య గౌడ్ చాలా ఏండ్ల కింద తాండూరు టౌన్‌కు వలస వచ్చారు. ఆయనకు నలుగురు కూతుళ్లు. ఒక కొడుకు ఉన్నారు. ఎల్లయ్య గౌడ్ ట్రావెల్ ఏజెన్సీ నడిపిస్తున్నాడు. ఇటీవల పెద్ద కూతురు అనూష పెండ్లిని ఘనంగా చేశాడు. రెండో కూతురు తనూష ఎంబీఏ చదువుతూ ఉద్యోగం చేస్తున్నది. మూడో కూతురు సాయిప్రియ హైదరాబాద్‌లోని కోఠి విమెన్స్కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్, నాలుగో కూతురు నందిని అదే కాలేజీలో డిగ్రీ ఫస్టియర్, కొడుకు తాండూరు టౌన్‌లోని ఓ ప్రైవేట్స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గత నెల 15న జరిగిన అక్క అనూష పెండ్లికి తనూష, సాయిప్రియ, నందిని వచ్చారు. సోమవారం పరీక్షలు ఉండడంతో ముగ్గురూ తాండూరు బస్టాండ్ నుంచి హైదరాబాద్‌వెళ్లే బస్సెక్కారు.
బస్సు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారని తెలుసుకున్న ఆ కుటుంబం షాక్‌కు గురైంది. ‘‘కాలేజీ నుంచి మీరు ఇంటికి వస్తే పండుగలా ఉండేది కదరా...మిమ్మల్ని ఎప్పుడూ బిడ్డలనుకోలేదే.. కొడుకుల్లా పెంచానే..మీరు లేరంటే ఎట్లా నమ్మాలిరా... ఇంటికి వచ్చి నా చుట్టూ చేరి ముచ్చట్లు పెడితే ఈ లోకంలో ఇంతకన్నా ఆనందం ఏముంటుంది అనుకునేవాడిని. మీరు లేని జీవితం ఊహించుకోలేకపోతున్నానురా బిడ్డలారా’ అని ఆ తల్లిదండ్రులు రోదిస్తుంటే ఆపడం ఎవరి తరం కాలేదు. ముగ్గురు అక్కాచెల్లెళ్ల అంత్యక్రియలను స్వగ్రామమైన పెర్కంపల్లిలో నిర్వహించగా గ్రామమంతా కదిలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికింది.
