హైదరాబాద్, వెలుగు: తెలంగాణ యంగ్ సెయిలర్లు సురగాని ఈశ్వ, కొమ్మరవెల్లి లహరి ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌కు అర్హత సాధించే దిశగా దూసుకెళ్తున్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన ఈ ఇద్దరు అమ్మాయిలు యాట్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్)లో కఠోర శిక్షణతో రాటు దేలి నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నీల్లో పతకాల మోత మోగిస్తున్నారు.
యాదాద్రి- భువనగిరి జిల్లా మోటకొండూర్ మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల స్కూల్ స్టూడెంట్ అయిన 14 ఏండ్ల ఈశ్వ గతేడాది ఏప్రిల్‌లో వైసీహెచ్లో సెయిలింగ్ ట్రెయినింగ్‌కు ఎంపికైంది. కేవలం 9 నెలల శిక్షణలోనే 29ఇఆర్ గర్ల్స్ కేటగిరీలో జరిగిన ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్ (2025, 2026) రెండింటిలోనూ స్వర్ణ పతకాలు సాధించింది.
మరోవైపు 15 ఏండ్ల లహరి ఇప్పటివరకు 19 నేషనల్ఈవెంట్లలో పాల్గొని 6 గోల్డ్ సహా 13 పతకాలు నెగ్గిన ఆమె ఆసియా గేమ్స్ సెలెక్షన్ ట్రయల్స్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఇద్దరినీ వైసీహెచ్ డైరెక్టర్, కోచ్ సుహీమ్ షేక్ మార్గనిర్దేశం చేస్తున్నాడు. రాబోయే ఇంటర్నేషనల్ సర్క్యూట్‌లో రాణిస్తే లహరి, ఈశ్వ కచ్చితంగా ఆసియా గేమ్స్‌కు క్వాలిఫై అవుతారని సుహీమ్ తెలిపాడు.
