హైదరాబాద్: వికారాబాద్ జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటీవల చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. ఈ ఘటన జరిగి సరిగ్గా రెండు రోజులు కూడా కాకముందే వికారాబాద్ జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. మంగళవారం (నవంబర్ 4) రాత్రి వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్ఏపీ కళాశాల దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
వేగంగా దూసుకొచ్చిన కారు వెనక నుంచి స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భారతి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త తులసిరామ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్కూటీని ఢీకొట్టిన తర్వాత కారు రోడ్డు పక్కన ఉన్న వాహనదారులపైకి దూసుకెళ్లడంతో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతురాలు భారతి, ఆమె భర్త తులసిరామ్ వికారాబాద్ పట్టణానికి చెందినవారిగా గుర్తించారు పోలీసులు. తులసిరామ్ పరిస్థితి విషమంగా ఉండటంతో వికారాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని కర్నూలు జిల్లాకు చెందిన శీను, లక్ష్మణ్, చిన్నగా గుర్తించారు.
వికారాబాద్ అనంతగిరిగుట్ట జాతర సందర్భంగా చిరు వ్యాపారం చేయడానికి వచ్చి ఈ ప్రమాదానికి గురయ్యారు. కారు నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వికారాబాద్ జిల్లాలో వరుస రోడ్డు ప్రమాదాలు జిల్లా వాసులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అధికారులు ఇప్పటికైనా మేల్కొని రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు.
