కార్తీకమాసం దీపాల కాంతులతో వెలిగిపోతుంది. ఆధ్యాత్మికంగా..కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైన రోజు. ఈ ఏడాది ( 2025) నవంబర్ 5న బుధవారం నాడు కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు . ఈ పవిత్రమైన రోజున ఆచరించే స్నాన, దాన, జప, తపాలకు అనంతమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున చేసే దానధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మన జాతకంలోని గ్రహ దోషాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించే శక్తి దానానికి ఉందని పెద్దలు చెబుతారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశి వారు ఏ వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . .
మేషరాశి: ఈ రాశికి అధిపతి కుజుడు. బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్రటి పండ్లు దానం చేయాలి. ఈ దానం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
వృషభరాశి: ఈ రాశికి శుక్రుడు అధిపతి ఈ రాశి వారికి జీవితంలో భోగభాగ్యాలు పెరగాలంటే శుక్రుడికి ప్రీతికరమైన తెల్లటి వస్తువులను దానం చేయాలి. బియ్యం, పాలు, పెరుగు, నెయ్యి, తెల్లటి నువ్వులు లేదా పాలతో చేసిన మిఠాయిలను, తెల్లటి దుప్పట్లు దానం చేయడం వల్ల దాంపత్య జీవితంలో మాధుర్యం పెరిగి, కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
మిథున రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు .. పెసర్లు, కొబ్బరికాయలు, పండ్లు , ఆకుకూరలు,ఆకుపచ్చ రంగు వస్త్రాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మేధస్సు పెరుగుతుంది. విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు వంటివి దానం చేస్తే కెరీర్ లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి, విజయం వరిస్తుంది.
కర్కాటక రాశి: ఈ రాశికి చంద్రుడు అధిపతి. ఈ రాశి వారు కార్తీక పౌర్ణమి నాడు చంద్రుని అనుగ్రహం కోసం పాలు, బియ్యం, చక్కెర, వెండి వస్తువులు లేదా తెల్లటి మిఠాయిలను దానం చేయాలి. పరమేశ్వరునికి అభిషేకం చేసేందుకు శివాలయంలో పాలను ఇవ్వాలి. పేదలకు నీటిని దానం చేయడం కూడా విశేష ఫలితాలను ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు దూరమై, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది.
సింహరాశి: ఈ రాశికి సూర్యుడు అధిపతి. బెల్లం, గోధుమలు, రాగి పాత్రలు, నారింజ రంగు , ఎర్రని రంగు వస్త్రాలు , ఎర్రటి పువ్వులను దానం చేయాలి. ఈ దానం వల్ల ప్రభుత్వ పనులలో విజయం, ఆత్మగౌరవం, వృత్తిలో ఉన్నత పదవులు లభిస్తాయి.
కన్యరాశి: ఈ రాశికి కూడా బుధుడే అధిపతి. కార్తీక పౌర్ణమి రోజున పెసలు, కొబ్బరికాయలు, పండ్లు ,ఆకుకూరలు, ఆకుపచ్చని వస్త్రాలు దానం చేయాలి.ఆవుకు పచ్చగడ్డిని తినిపించడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. నెయ్యిని దానం చేయడం కూడా బుధ గ్రహాన్ని శాంతింపజేసి, వృత్తిపరమైన అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంది.
తులరాశి: ఈ రాశికి శుక్రుడు అధిపతి తెల్లని వస్త్రాలు, బియ్యం, పెరుగు, సుగంధ ద్రవ్యాలు (అత్తరు, పర్ఫ్యూమ్), నెయ్యి , చక్కెర దానం చేయాలి. దీనివల్ల శుక్రుడి అనుగ్రహం లభించి, ఆర్థిక స్థిరత్వం, దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతాయి .
వృశ్చికరాశి: ఈ రాశికి కుజుడు అధిపతి. బెల్లం, ఎర్రటి వస్త్రాలు, పప్పులు, ఎర్ర కందిపప్పు, దానిమ్మ వంటి పండ్లు ,ఎర్రటి పండ్లు దానం చేయాలి. అవసరంలో ఉన్నవారికి ధనాన్ని దానం చేయడం వల్ల ప్రతికూల శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది.
ధనుస్సురాశి:ఈ రాశికి బృహస్పతి అధిపతి . పసుపు రంగు వస్తువులను దానం చేయాలి. పసుపు, శనగలు, బెల్లం దానం చేయాలి.అరటిపండ్లు, పసుపు రంగు వస్త్రాలు, పసుపు, కుంకుమపువ్వు లేదా శనగపిండితో చేసిన లడ్డూలను దానం చేయడం వల్ల జ్ఞానం వృద్ధి చెంది, కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి.
మకరరాశి: ఈ రాశికి న్యాయదేవత శని భగవానుడుఅధిపతి .కార్తీక పౌర్ణమి నాడు నల్ల నువ్వులు, ఆవాల నూనె,నువ్వుల నూనె, మినపప్పు, నల్లని దుప్పటి , ఇనుప వస్తువులను దానం చేయడం వల్ల శని గ్రహం ప్రతికూల ప్రభావాలు తగ్గి, వృత్తి జీవితంలోని ఆటంకాలు తొలగిపోయి, విజయం చేకూరుతుంది.
కుంభరాశి:ఈ రాశికి కూడా శనిభగవానుడే అధిపతి . ఈ రాశి వారు కూడా నల్ల నువ్వులు, నల్ల నువ్వుల నూనె, బట్టలు,మినపప్పు, చెప్పులు లేదా అవసరమైన వారికి ధనాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగి, కెరీర్ లో కొత్త అవకాశాలు లభిస్తాయి.
మీనరాశి: ఈ రాశికి బృహస్పతి అధిపతి పసుపు, శనగలు, బెల్లం, శనగపప్పు, పసుపు రంగు వస్త్రాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, పుస్తకాలు, అరటిపండ్లను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల గురు బలం పెరిగి, సంపద వృద్ధి చెంది, మంచి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనంలోని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
