'సీతారామం', 'లక్కీ భాస్కర్' వంటి విజయాలతో తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైన మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్. ఈ హీరో నటిస్తున్న లేటెస్ట్, మోస్ట్ అవైటెడ్ చిత్రం 'కాంత' (Kaantha). పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం 1960ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమ నేపథ్యాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్‌లో భాగంగా.. తాజాగా ఉత్కంఠను పెంచే గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
ఉత్కంఠభరితమైన గ్లింప్స్..
'కాంత' ట్రైలర్‌ను నవంబర్ 6న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఈ ప్రత్యేక వీడియో ద్వారా వెల్లడించింది. లేటెస్ట్ గా విడుదలైన గ్లింప్స్‌లో "అసలిక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు" అనే డైలాగ్‌తో మొదలై, "ఈ సినిమా నేను తీస్తా.. మీరు అది ఒక మూలన కూర్చొని చూడండి" అని దుల్కర్ సల్మాన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్.. సినిమా కథాంశంపై ఆసక్తిని పెంచింది. ఈ గ్లింప్స్‌లో నటుడు సముద్రఖని "నిన్ను చంపబోతున్నాను మహదేవ" అంటూ హెచ్చరించడం.. దుల్కర్ పాత్రకు, కథకు మధ్య ఉన్న తీవ్రమైన వైరుధ్యాన్ని సూచిస్తోంది.
మద్రాస్ సినీ చరిత్ర నుంచి ప్రేరణ..
దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం కేవలం కల్పిత కథ మాత్రమే కాదు, 1960ల నాటి మద్రాస్ సినీ పరిశ్రమలో జరిగిన కొన్ని ఉత్కంఠభరిత సంఘటనల ఆధారంగా రూపొందినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, ఆనాడు ప్రముఖ నటుడు ఎం.కె. త్యాగరాజ భాగవతార్ ఒక హత్య కేసులో ఇరుక్కున్న అంశాల నుండి దుల్కర్ సల్మాన్ పాత్ర ప్రేరణ పొందినట్టు సినీ వర్గాల టాక్. ఈ యాక్షన్ థ్రిల్లర్ పాత మద్రాస్ సినీ గ్లామర్‌తో పాటు, తెరవెనుక జరిగిన రాజకీయాలు, వివాదాలను కళ్లకు కట్టేలా ఉంది.
ఈ చిత్రానికి టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. ఇది ఈ ప్రాజెక్ట్ స్థాయిని, అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాలో దుల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'అమ్మాడివే' సాంగ్, 'రేజ్ ఆఫ్ కాంత' ట్రాక్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా భారీ స్థాయిలో రూపొందిన 'కాంత' సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
