
- 2 గంటల్లో హైదరాబాద్ టు విజయవాడ
- ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- 2 నెలల్లో పనులు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు ప్రారంభిస్తాం
- ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్ పేట వరకు డబుల్ డెక్కర్
- ఫ్లైఓవర్ నిర్మిస్తామని వెల్లడి
- ఎలివేటెడ్ ఫ్లై ఓవర్ పనులను పరిశీలించిన మంత్రి
ఎల్బీ నగర్, వెలుగు: హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు విమాన ప్రయాణం మొత్తం 5 గంటల సమయం పడుతుందని, కానీ రోడ్డు మార్గంలో 2 గంటల్లోనే చేరుకునేలా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మిస్తామని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. 2 నెలల్లో ఆ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారని, తెలుగు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందన్నారు. ఎల్బీ నగర్ నుంచి పెద్ద అంబర్పేట వరకు రూ.650 కోట్లతో నిర్మించనున్న ఎలివేటెడ్ ఫ్లైఓవర్ కారిడార్ (డబుల్ డెక్కర్ ప్లైఓవర్) నిర్మాణ పనులను ఆదివారం వనస్థలిపురంలో మంత్రి పరిశీలించారు.
పనామా గోడౌన్స్ నుంచి సుష్మా థియేటర్ చౌరస్తా వరకు ఆర్ అండ్ బీ అధికారులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్ రెడ్డి రామ్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కారిడార్ ప్రత్యేకమైందని, ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, పెద్దఅంబర్ పేట వరకు, ఓఆర్ఆర్ మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామన్నారు. వనస్థలిపురం నుంచి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు సుమారు 6 కి.మీ మెట్రో రైలు మార్గం గుండా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి త్వరలో విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. రూ.2,300 కోట్లతో గౌరెల్లి, వలిగొండ, భద్రాచలం గ్రీన్ ఫీల్డ్ హైవే మంజూరైందని, ఇప్పటికే వలిగొండ తొర్రూరు మధ్య నిర్మాణ పనులు పూర్తయ్యాయన్నారు. తొర్రూరు, భద్రాచలం మధ్య రోడ్డు పనుల కోసం టెండర్ ప్రక్రియ కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఆందోల్ మైసమ్మ నుంచి విజయవాడ వరకు రూ.375 కోట్లతో రోడ్డు నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నదని, మధ్యలో 17 బ్లాక్ స్పాట్స్ (యాక్సిడెంట్ స్పాట్స్) గుర్తించామని చెప్పారు.
మళ్లీ కాంగ్రెస్ హయాంలో మెట్రో రెండో దశ
మెట్రో రైలు రెండో దశ అనుమతులకు సంబంధించిన బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచారని మంత్రి వెంకట్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి మెట్రో మొదటి దశ నిర్మాణం కోసం అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి కృషి చేశారని, మళ్లీ కాంగ్రెస్ హయాంలోనే రెండో దశ మెట్రోకు శ్రీకారం చుట్టామని తెలిపారు. కాగా.. హైదరాబాద్ ను అభివృద్ధి చేశామంటున్న కేటీఆర్.. ఉప్పల్ – నారపల్లి ఫ్లైఓవర్ ను ఎందుకు పూర్తి చేయలేదని మంత్రి ప్రశ్నించారు. ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, ఎందరో దంపతులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు.
బీసీ రిజర్వేషన్లతో కవితకు ఏం పని?
బీసీ రిజర్వేషన్లతో కేసీఆర్ బిడ్డ కవితకు ఏం పని అని మంత్రి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. బీసీలకు పదేండ్ల పాటు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. అధికారం పోగానే కవితకు బీసీలు గుర్తుకు వచ్చారా అని నిలదీశారు. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నాన్చుతోందని మంత్రి దుయ్యబట్టారు.