- అసెంబ్లీ మొదలు పంచాయతీలు,
- మున్సిపాలిటీల దాకా విజయయాత్ర
- 52 శాతం వార్డులు అధికార పార్టీ ఖాతాలో
- 2018లో 28.43 శాతంగా ఉన్న ఓట్ షేర్.. 2024 పార్లమెంటు ఎన్నికల్లో 40.10 శాతానికి
- ఈ విజయాలే ప్రభుత్వానికి రెఫరెండం అంటున్న కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలేవైనా ‘హస్తం’ హవా కొనసాగుతోంది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో మొదలైన విజయయాత్ర.. బైపోల్స్, పంచాయతీ ఎన్నికలు.. తాజాగా మున్సిపల్ ఎలక్షన్స్ వరకు సాగుతున్నది. పల్లె ఓటరు నుంచి పట్నం ఓటరు వరకు అంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వరుస విజయాలతో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించింది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో వెలువడిన ఫలితాలు అధికార పార్టీ పనితీరుకు గీటురాయిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని పట్టణ ఓటర్లు సైతం ‘ప్రజా ప్రభుత్వం’ వైపు మొగ్గు చూపుతూ స్పష్టమైన తీర్పునివ్వడమే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు.
నాలుగు నుంచి 90కి పైగా మున్సిపాలిటీల వైపు
తాజా ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,996 వార్డులకు గాను దాదాపు 52 శాతం వార్డుల్లో హస్తం అభ్యర్థులే విజయం సాధించారు. గతంలో అంటే 2020లో కేవలం నాలుగు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ గెలవగా.. ప్రస్తుతం 85 కైవసం చేసుకొని 90కిపైగా సాధించే దిశగా దూసుకెళ్తోంది. బీఆర్ఎస్ పార్టీ కేవలం 26.10 శాతానికి పరిమితం కాగా, బీజేపీ 11.19 శాతంతో మూడో స్థానానికి పడిపోయింది. రాష్ట్రంలో పల్లె ఓటరు నుంచి పట్టణ ఓటరు దాకా అందరూ ఒకే మాటపై ఉన్నట్లు ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. డిసెంబరులో జరిగిన 12,702 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 8,335 స్థానాల్లో (66%) గెలిచి రికార్డు సృష్టించారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్ ఏడేండ్ల కాలంలో అనూహ్యంగా పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 28.43 శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్, 2024 పార్లమెంట్ ఎన్నికల నాటికి 40.10 శాతానికి చేరింది. ఇటీవల జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపించింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఏకంగా 50.83 శాతానికి ఎగబాకింది. గ్రామ పంచాయతీల్లో 66 శాతం సీట్లు, మున్సిపాలిటీల్లో 52 శాతం సీట్లతో స్పష్టమైన ఓటు బ్యాంకును సంపాదించుకున్నది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ ఓటు షేర్పెరుగుతుండగా.. మరో వైపు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు దారుణంగా పడిపోతోంది. 2018లో 46.87 శాతంతో అప్రతిహతంగా సాగిన ఆ పార్టీ ఓటు షేర్, పార్లమెంట్ ఎన్నికల నాటికి 16.68 శాతానికి దిగజారింది. పంచాయతీ ఎన్నికల్లో, ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మరింత దిగజారింది. గతంలో 116 మున్సిపాలిటీలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు 26 శాతం వార్డులకే పరిమితమైంది. అధికారం కోల్పోయిన ఏడాదిలోపే ఆ పార్టీ ఈ స్థాయిలో ప్రజాదరణ కోల్పోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వ పనితీరు.. పథకాలే
గెలుపు మార్గాలంటున్న విశ్లేషకులు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయానికి సోపానాలుగా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ‘తెలంగాణ రైజింగ్’ విజన్ కింద పట్టణ ప్రాంతాల అభివృద్ధికి ఏకంగా రూ.17 వేల కోట్లు ఖర్చు చేయడం, ప్రతి పట్టణానికి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించడం ఓటర్లను ఆకర్షించిందని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పేదలకు రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా వెళ్లాయని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇక స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి పట్టణాల భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం కాంగ్రెస్ ఓటు బ్యాంకును మరింత సుస్థిరం చేసిందని అభిప్రాయపడ్తున్నారు.
