- పదేండ్లల్ల కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే.. మేం పూర్తి చేస్తున్నం: సీఎం రేవంత్ రెడ్డి
- టిమ్స్‌తో పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం
- ప్రతి ఆరు నెలలకో కొత్త దవాఖాన
- అదనపు సమయం కేటాయించే సర్కారు డాక్టర్లకు ఇన్సెంటివ్ లు
- సనత్ నగర్లో డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో పాలకులు ఫామ్‌హౌస్‌లు కట్టుకుంటే.. ప్రజా ప్రభుత్వంలో మేం పేదల కోసం అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను కట్టి, ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వారు కేవలం శంకుస్థాపనల పేరిట కొబ్బరికాయలు కొట్టి వదిలేసిన ప్రాజెక్టులను మేం నిధులు కేటాయించి రికార్డు సమయంలో పూర్తి చేస్తున్నామని చెప్పారు. సోమవారం సనత్ నగర్ ‘డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (ఎంసీఆర్ టిమ్స్) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో కలిసి సీఎం ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మీరే కడితే ఎందుకు రిబ్బన్ కట్ చేయలే?
సనత్ నగర్ టిమ్స్‌ను పరిశీలించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘‘టిమ్స్ హాస్పిటల్‌ను తామే కట్టామని కేటీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలు పగటి వేషగాళ్లలా వచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. టిమ్స్ హాస్పిటల్స్ మీరే కడితే పదేండ్ల మీ ప్రభుత్వ హయాంలో ఎందుకు రిబ్బన్ కట్ చేయలేకపోయారు? సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌తో పాటు వరంగల్ హాస్పిటల్‌కు కేవలం కొబ్బరికాయలు కొట్టి నిధులు ఇవ్వకుండా గాలికొదిలేసింది మీరు కాదా? ఉస్మానియా హాస్పిటల్ శిథిలావస్థకు చేరితే పట్టించుకోకుండా నిర్వీర్యం చేయాలని చూశారు. కానీ, మా ప్రభుత్వం వచ్చాక గోషామహల్ గ్రౌండ్స్‌లో రూ.2,700 కోట్లతో 2 వేల బెడ్లతో కొత్త ఉస్మానియా నిర్మాణానికి శ్రీకారం చుట్టాం’’ అని సీఎం పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల్లో, కేటీఆర్ జన్వాడలో వంద ఎకరాల్లో, కవిత శంకర్‌పల్లిలో, హరీశ్‌రావు మోయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకోవడానికి ఒక్క రోజు కూడా ఆలస్యం కాలేదు. వాటి నిర్మాణాలు సరైన సమయంలో పూర్తయి ప్రారంభమయ్యాయి. కానీ, నిరుపేదల ప్రాణాలు కాపాడే దవాఖానల నిర్మాణం పూర్తి చేయడానికి మాత్రం మీకు పదేండ్ల సమయం సరిపోలేదా?’’ అని సీఎం నిలదీశారు. ‘‘సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసానితో కలిసి టిమ్స్‌ను చూసి వచ్చిన కేటీఆర్.. పక్కనే ఉన్న ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు వెళ్లి నేనే టిమ్స్ కట్టానని చెబితే, అక్కడ ఉన్న పేషెంట్ ‘ఊకో బిడ్డా.. మొదట్లో నేను కూడా ఇలాగే మాట్లాడేటోడిని, రానురాను అదే తగ్గిపోతది’ అని చెప్పాడట’’ అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
విద్య, వైద్యానికి ప్రాధాన్యం..
తమ ప్రభుత్వం విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం వెల్లడించారు. తమ 32 నెలల ప్రజా పాలనలో నిరుపేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ కింద రూ.2,700 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.2,526 కోట్లు కలిపి మొత్తం రూ.5,226 కోట్లు వెచ్చించామని, వైద్యశాఖపై ప్రభుత్వం ఇప్పటివరకు రూ.21,800 కోట్లు ఖర్చు చేసి దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని సీఎం వివరించారు. అలాగే 12వ తరగతి పూర్తయిన తర్వాత యువతకు టెక్నికల్ స్కిల్స్ నేర్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తే, సంక్షేమ పథకాలపై ఆధారపడరని సీఎం వెల్లడించారు.
2034 దాకా మీ బుద్ధి రావొద్దు..
‘‘రాష్ట్రంలో కరువు రావాలని అఘోర దీక్షలు, రైతు లు చనిపోవాలని కోరుకునే బీఆర్‌ఎస్ నేతల బుద్ధి మారాలి. లక్షల కోట్లు దోచుకున్న నాయకులు నియోజకవర్గానికి రూ.10 కోట్లు ఖర్చు చేసి ప్రజలకు సేవ చేస్తే పాపాలు కొంతైనా పోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సృష్టించే తప్పుడు వీడియోలతో, సోషల్ మీడియా అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేయలేరు. పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు ఇచ్చి, అసెంబ్లీలో గుణపాఠం చెప్పినా బీఆర్‌ఎస్ కు బుద్ధి రాలేదు. 2034 దాకా కేసీఆర్, కేటీఆర్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లు మారితే మాకు కష్టం ఎక్కువవుతుంది. వాళ్లు అబద్ధాలు ఆపనంత కాలం నేను నిజాలు చెప్పడం మానను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పారు.
నాణ్యమైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం: భట్టి
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యటీ సీఎం భట్టి అన్నారు. ‘ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్య రంగం అభివృద్ధికి రూ.8,922 కోట్లు ఖర్చు చేసినం. టిమ్స్ సహా ప్రధాన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రెండున్నరేండ్లలో రూ.3,880 కోట్లు విడుదల చేశాం’ అని తెలిపారు.
రిఫరల్ సెంటర్‌గా సనత్‌నగర్ టిమ్స్: రాజనర్సింహ
సనత్‌నగర్ డాక్టర్ ఎంసీఆర్ టిమ్స్‌ను ప్రత్యేక వైద్య కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దామోదర్‌రాజనర్సింహ తెలిపారు. ‘53 ఎకరాల్లో 1,082 పడకలతో ఈ ఆస్పత్రిని నిర్మించాం. కార్డియాక్, కిడ్నీ, ట్రాన్స్‌ప్లాంట్ సేవలకు ఇది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా పనిచేస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా మెడికల్ టూరిజాన్ని కూడా ప్రోత్సహిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు.
అందుబాటులోకి 10 వేల బెడ్లు
పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోందని సీఎం వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకు ఒక కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభిస్తాం. 2027 డిసెంబర్ 9 నాటికి అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్‌లతో పాటు వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, నూతన ఉస్మానియా హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేస్తాం. ఇవన్నీ అందుబాటులోకి వస్తే సర్కారు దవాఖానల్లో అదనంగా 10 వేల బెడ్లు పేదలకు అందుబాటులోకి వస్తాయి. ప్రతి టిమ్స్ హాస్పిటల్‌కు ఒక్కో డైరెక్టర్‌ను నియమించి, అపోలో, ఏఐజీ తరహా శానిటేషన్ మెయింటెనెన్స్ ఉండేలా చూస్తాం. రోగులతో వచ్చే అటెండెంట్లు బయట ఇబ్బంది పడకుండా డార్మిటరీలు, క్యాంటీన్ సౌకర్యాలు కల్పిస్తాం’’ అని వివరించారు.
అదనంగా పనిచేసే డాక్టర్లకు ఇన్సెంటివ్‌లు..
సర్కారు దవాఖానల్లో సేవలందిస్తూ అదనపు సమయం కేటాయించే సూపర్ స్పెషాలిటీ డాక్టర్లకు ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇన్సెంటివ్‌లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు సీఎం సూచించారు. డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా ప్రభుత్వ హాస్పిటల్స్ లోనే పూర్తి సమయం వెచ్చించేలా ప్రోత్సహిస్తామన్నారు. హాస్పిటల్ కు వచ్చే రోగులకు 70 శాతం వైద్య సేవలు అందించేది నర్సులేనని, తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు జర్మనీ, జపాన్ వంటి దేశాల్లో భారీ డిమాండ్ ఉందన్నారు. ఇప్పటికే వైద్యారోగ్య శాఖలో 16 వేల మంది సిబ్బందిని రికార్డు స్థాయిలో నియమించినట్లు తెలిపారు.
