కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్‌లో ఘోరం జరిగింది. తారాపీఠ్ ఆలయానికి సమీపంలో ఉన్న హోటల్ ‘బిదేశినీ’లో అగ్ని ప్రమాదం జరగడంతో 8 మంది మంటలకు ఆహుతయ్యారు. హోటల్‌లోని ఎమర్జెన్సీ ఎగ్జిట్ ను లాక్ చేసి ఉండటంతో మంటల నుంచి తప్పించుకునే మార్గం లేక లోపలే చిక్కుకుపోవడం వల్లే వీరంతా చనిపోయారు. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో మరో 28 మందిని పోలీసులు కాపాడారు. వీరిలో పలువురికి గాయాలయ్యాయి.
మృతుల్లో ఐదుగురు మేఘాలయకు చెందినవారు, ముగ్గురు బెంగాల్‌లోని అలీపుర్ద్వార్‌కు చెందినవారు ఉన్నారని అధికారులు తెలిపారు. ముందుగా హోటల్ రిసెప్షన్ వద్ద తెల్లవారుజామున ఉదయం 4.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయని స్థానికులు వెల్లడించారు. ఫాల్స్ సీలింగ్‌లు, ఫైబర్ ఇంటీరియర్ ప్యానెలింగ్ కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని వారు పేర్కొన్నారు. శ్రావణమాసం సందర్భంగా తారాపీఠ్ ఆలయానికి రద్దీ బాగా పెరిగింది. దీంతో ఈ హోటల్ కూడా పర్యాటకులతో కిటకిటలాడింది.
అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొందరు బాల్కనీల్లో నుంచి కిందకు దూకేశారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. హోటల్‌లో వెనుక వైపు అత్యవసర ద్వారం ఉన్నప్పటికీ, అక్కడ ఉన్న గ్రిల్స్‌కు తాళాలు వేసి ఉన్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. సిబ్బంది తాళాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారిని రక్షించినట్టు పేర్కొన్నారు. కాగా, హోటల్ ఓనర్‌ను అదుపులోకి తీసుకున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ. 50 వేల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
