పోలీస్ శాఖలో అన్నీ AI తోనే : ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నుంచి చార్జిషీట్‌‌‌‌ దాకా ..స్మార్ట్ దర్యాప్తునకు చర్యలు

పోలీస్ శాఖలో అన్నీ AI తోనే : ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నుంచి చార్జిషీట్‌‌‌‌ దాకా ..స్మార్ట్ దర్యాప్తునకు చర్యలు
  • ఏ భాషలో వాంగ్మూలం ఇచ్చినా ఇంగ్లీష్ లోకి 
  • మార్చేలా ఏఐ కాప్ రైటర్
  • ఐదుగురు ఐపీఎస్‌‌‌‌ అధికారులతో టెక్‌‌‌‌ టీమ్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా పోలీస్ డిపార్ట్ మెంట్ ను స్మార్ట్‌‌‌‌ పోలీసింగ్‌‌‌‌గా మార్చేందుకు ఆ శాఖ చర్యలు  చేపడుతోంది. ఇకపై పోలీస్‌‌‌‌ విధుల్లో ఆర్టిఫీషియల్‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌ (ఏఐ) కీలక పాత్ర పోషించనుంది. డయల్‌‌‌‌ 112, సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌, నార్కోటిక్స్‌‌‌‌, ఇతర  నేరాల్లో నిందితులను గుర్తించేందుకు అధునాతన ఏఐ టూల్స్‌‌‌‌ను వినియోగించనున్నారు. 

క్రైమ్‌‌‌‌ అండ్‌‌‌‌ క్రిమినల్‌‌‌‌ ట్రాకింగ్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ (సీసీటీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌), టీజీ కాప్‌‌‌‌ 2.0 మాడ్యూళ్లను అప్‌‌‌‌గ్రేడ్‌‌‌‌ చేయడంపై డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ దృష్టి సారించారు. కేసుల దర్యాప్తులో రియల్‌‌‌‌ టైమ్‌‌‌‌ డేటాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కేసుల సమాచారాన్ని క్షేత్రస్థాయి పోలీసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఆటోమేటిక్‌‌‌‌గా వాంగ్మూలం

‘ఏఐ ఎనేబుల్డ్‌‌‌‌ టూల్‌‌‌‌’, ‘ఏఐ కాప్‌‌‌‌ రైటర్‌‌‌‌’ ద్వారా ఫిర్యాదుదారులు, సాక్షులు తమకు తెలిసిన ఏ భాషలోనైనా వాంగ్మూలం ఇవ్వొచ్చు. వారు మౌఖికంగా చెప్పిన వివరాలను ఏఐ కాప్‌‌‌‌ రైటర్‌‌‌‌ ఆటోమేటిక్‌‌‌‌గా ఇంగ్లిష్‌‌‌‌లోకి మారుస్తుంది.

 అనంతరం ప్రింట్‌‌‌‌ తీసుకుని ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌ నమోదు కోసం దర్యాప్తు అధికారులకు అందజేయవచ్చు. చోరీ వాహనాలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాల ఫీడ్‌‌‌‌లను ఏఐ ఆధారిత వీడియో అనలిటిక్స్‌‌‌‌ ద్వారా స్కాన్‌‌‌‌ చేస్తున్నారు.

జైలు, పోలీస్‌‌‌‌, కోర్టు డేటా లింక్‌‌‌‌

జైళ్లు, పోలీసులు, కోర్టులను డేటా షేరింగ్‌‌‌‌ కోసం అనుసంధానం చేస్తున్నారు. ఖైదీ బెయిల్‌‌‌‌పై విడుదలైన వెంటనే ఆ సమాచారం ఏఐ ఆధారిత వ్యవస్థతో ఆటోమేటిక్‌‌‌‌గా అప్‌‌‌‌డేట్‌‌‌‌ అవుతుంది. అది పోలీసులు, కోర్టులు, ఇతర సంబంధిత విభాగాలకు అందుబాటులోకి వస్తుంది. టీజీ కాప్‌‌‌‌ యాప్‌‌‌‌  ద్వారా కానిస్టేబుల్‌‌‌‌ తన పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ నుంచే ఏ నిందితులు విడుదలయ్యారు, వారిపై పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులు, ఇతర వివరాలను ఫోన్‌‌‌‌లోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది.
 
ఒక్కో ఐపీఎస్‌‌‌‌కూ ఒక్కో వింగ్‌‌‌‌


ఏఐతో కేసుల దర్యాప్తు, అధికారులకు రియల్‌‌‌‌ టైమ్‌‌‌‌ డేటా షేరింగ్‌‌‌‌ కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నారు. పోలీస్‌‌‌‌ స్టేషన్లలో డేటా అప్‌‌‌‌లోడ్‌‌‌‌కు కాలపరిమితి విధించనున్నారు. నిర్ణీత గడువులోగా డాక్యుమెంట్లను అప్‌‌‌‌లోడ్‌‌‌‌ చేయకపోతే తర్వాత వాటిని నమోదు చేసేందుకు వ్యవస్థ అనుమతించకుండా చర్యలు తీసుకోనున్నారు. 

ఈ అంశాలపై మే నెలలో డీజీపీ సీవీ ఆనంద్‌‌‌‌ సమీక్ష నిర్వహించారు. ఐదుగురు ఐపీఎస్‌‌‌‌ అధికారులతో ప్రత్యేక టెక్‌‌‌‌ టీమ్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. సీసీటీఎన్‌‌‌‌ఎస్‌‌‌‌లో ఏఐ టెక్నాలజీ, సోషల్‌‌‌‌ మీడియా, వీడియో అనలిటిక్స్‌‌‌‌, ఏఐ ఆధారిత డ్రోన్‌‌‌‌ టెక్నాలజీ, రోడ్‌‌‌‌ సేఫ్టీ, డేటా ఇంటెలిజెన్స్‌‌‌‌, సిస్టమ్‌‌‌‌ డిజైనింగ్‌‌‌‌, శిక్షణ తదితర విభాగాలను ఒక్కో ఐపీఎస్‌‌‌‌ అధికారికి అప్పగించారు.