హైదరాబాద్ సిటీ, వెలుగు: హైడ్రాను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి చెరువులు, వరద కాలువలను పరిరక్షించాలని పలు వృత్తులకు చెందిన నిపుణులు కోరారు. నగర, శివారు ప్రాంతాలకు చెందిన న్యాయవాదులు, పర్యావరణవేత్తలు, డాక్టర్లు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. హైడ్రా పునరుద్ధరించిన చెరువులను పరిశీలిస్తే ఎంతో సంతోషంగా ఉందన్నారు. చెరువులకు ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తే వరదలను చాలా వరకు నియంత్రించవచ్చన్నారు.
చెరువుల చుట్టూ హైడ్రా అభివృద్ధి చేస్తున్న పచ్చదనం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గతంలో చెరువుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, పూడిక కారణంగా భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం పూడిక తొలగించడంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయన్నారు. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా ఉంటే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
లేఅవుట్లలోని రోడ్లు, పార్కులను కాపాడండి – ప్రజావాణిలో హైడ్రాకు ఫిర్యాదులు
లేఅవుట్లలోని రోడ్లు, పార్కులు ఆక్రమణలకు గురవుతున్నాయని వాటిని రక్షించాలని హైడ్రా ప్రజావాణికి పలు ఫిర్యాదులు వచ్చాయి. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 52 ఫిర్యాదులు రాగా.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించి పరిష్కారం కోసం అధికారులకు అప్పగించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేటలోని సర్వే నంబర్లు 668 నుంచి 674 వరకు సుమారు 28 ఎకరాల్లో 1991లో గ్రీన్‌ఫీల్డ్ కాలనీ పేరుతో లేఅవుట్ ఏర్పాటు చేశారు. 2018లో కొన్ని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ కూడా పూర్తయ్యింది. అయితే ఇదే లేఅవుట్ భూములను తిరిగి ఇతరులకు అమ్మి, పాత లేఅవుట్‌ను కనుమరుగు చేసేలా ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.
లేఅవుట్‌లోని రోడ్లు, పార్కులను కాపాడి పాత లేఅవుట్‌ను పరిరక్షించాలని కోరారు. గాజులరామారం దేవేందర్‌నగర్‌లోని చింతల్ చెరువు ప్రాంతం, సర్వే నంబర్ 329లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని వీనస్ రాక్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ఫిర్యాదు చేశారు. గతంలో హైడ్రా తొలగించిన నిర్మాణాలను తిరిగి చేపడుతున్నారని, అనధికార విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమితోపాటు చెరువు ప్రాంతాన్ని పరిరక్షించాలని, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు.
వనస్థలిపురం మారుతీనగర్‌లో సర్వే నంబర్లు 158, 159, 179లోని ప్లాట్ నంబర్లు 226, 227లను కాలనీ ఆలయం, పబ్లిక్ పార్కు కోసం కేటాయించినప్పటికీ ఆక్రమణకు గురయ్యాయని మారుతీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. అనుమతులు లేకుండా మూడు అంతస్తుల భవన నిర్మాణం చేపడుతున్నారని, గతంలో అడ్డుకున్న పనులను తిరిగి కొనసాగిస్తున్నారని తెలిపారు. స్థలాన్ని పరిరక్షించి పార్కు, ఆలయ స్థలాన్ని కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మేకలమండి బస్తీలో సర్వే నంబర్ 242లోని ప్రభుత్వ స్థలాన్ని కొందరు ఆక్రమించి ప్రహరీలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆక్రమణల కారణంగా కాలనీకి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరారు.
ఆఫీసర్స్ కాలనీవాసులకు అండగా ఉంటాం
- హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం వనస్థలిపురం సాహెబ్‌నగర్‌లోని ఆఫీసర్స్ కాలనీలో ఆక్రమణకు గురైన భూమిని సోమవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. 1987లో ఏర్పాటు చేసిన ఈ లే అవుట్‌లోని ప్లాట్‌నంబర్లు 39, 40లను పార్కు, ఇతర అవసరాల కోసం కేటాయించగా, 2023లో ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకున్నారని కాలనీవాసులు ఆరోపించారు. జీ+1 అనుమతి ఉన్నప్పటికీ 4 అంతస్తుల వరకు నిర్మాణాలు చేపట్టినట్లు హైడ్రా చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. వివాదం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ అంశాలను కోర్టుకు నివేదిస్తామని ఆచన స్పష్టం చేశారు. కాలనీవాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కోర్టు అనుమతితో స్థలాన్ని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
