- 13.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.7.4 లక్షల నగదు స్వాధీనం
మెహిదీపట్నం, వెలుగు: లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధులను లక్ష్యంగా చేసుకుని దృష్టి మళ్లించి, దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. టోలిచౌకి ఏసీపీ సయ్యద్ ఫయాజ్ సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఫూల్ బాగ్ బాబా నగర్, సంతోష్ నగర్, మీరాలం మండి గుల్జారా హౌస్ ప్రాంతాలకు చెందిన ఆరుగురు నిందితులు సయ్యద్ అసద్, ఉమర్ ఖాన్, సయ్యద్ మోయిన్, హుస్సేన్, మహమ్మద్ ఇబ్రహీం, సయ్యద్ అబ్దుల్ మాజీద్ కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు.
ఈ నెల 1న నానల్‌నగర్ బస్టాప్‌వద్ద కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా హుమ్నాబాద్ ప్రాంతానికి చెందిన ఎస్బీఐ రిటైర్డ్ మేనేజర్ దామా మోహన్‌ను ఆటోలో ఎక్కించుకుని, సన్‌సిటీ వైపు వెళ్తుండగా బెదిరింపులకు పాల్పడి ఆయన వద్ద ఉన్న 13.5 తులాల బంగారు ఆభరణాలు, రూ.7.4 లక్షల నగదును దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్, లంగర్‌హౌస్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి ఆదివారం సాయంత్రం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం, నగదుతోపాటు నేరానికి ఉపయోగించిన ఆటో, బైక్, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించిన ఎస్సై రాంబాబు, క్రైం సిబ్బందిని ఏసీపీ సయ్యద్ ఫయాజ్, సీఐ వెంకట రాములు, డీఐ సత్యనారాయణ అభినందించారు.
