- ఓబీసీ హోదాపై క్లారిటీ ఇవ్వాలని సెన్సస్ కమిషనర్‌కు లేఖ
హైదరాబాద్, వెలుగు: జనగణనపై కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌లో ఓబీసీ, ఎస్‌ఈబీసీ ప్రస్తావన లేదని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. ఓబీసీలను జనగణనలో నమోదు చేస్తారా? లేదా? అనే దానిపై క్లారిటీ ఇవ్వాలని కోరుతూ సోమవారం రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృతుంజయ్ కుమార్, సెన్సస్ కమిషనర్ నారాయణ్‌కు బీసీ కమిషన్ తరఫున లేఖ రాశారు.
కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన మాత్రమే ఉందని నిరంజన్ చెప్పారు. జనగణనలో కుల వివరాలు సేకరిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఓబీసీ, ఎస్‌ఈబీసీలు ఆశలు పెట్టుకున్నారని తెలిపారు. తాజాగా వచ్చిన గెజిట్‌తో వారిలో ఆందోళన మొదలైందన్నారు. దేశంలో ఉన్న మొత్తం జనాభా కుల వివరాలు నమోదు చేస్తామని స్పష్టంగా పేర్కొంటూ గెజిట్‌లో సవరణ చేయాలని కోరారు.
కులాలకు డిజిటల్ కోడ్..
జనగణనలో ఓబీసీ, ఎస్‌ఈబీసీ జాబితాలను రాష్ట్రాల వారీగా రూపొందించాలని నిరంజన్ సూచించారు. కేంద్ర ఓబీసీ జాబితా నుంచి రాష్ట్రాల వారీ జాబితాలను వేరు చేసి మాస్టర్ కులాల డైరెక్టరీ తయారు చేయాలని కోరారు. గుర్తింపు పొందిన ప్రతి కులానికి ప్రత్యేక డిజిటల్ కోడ్ ఇవ్వాలని సూచించారు. ఒకే కులం పేరుతో నకిలీ, తేడా నమోదులను అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. జాబితాలో లేని లేదా వివాదంలో ఉన్న కులాల పేర్లను కూడా నమోదు చేసి, వాటిని నిర్ధారించే ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు.
