గచ్చిబౌలి, వెలుగు: ఎయిర్‌టెల్ మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలంటూ సైబర్ నేరగాడు ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని మోసం చేసి రూ.3.87 లక్షలు కాజేశారు. కూకట్ పల్లికి చెందిన 31 ఏళ్ల మహిళా సాఫ్ట్ వేర్ ఉద్యోగికి గత జూలై 27న ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. నంబర్ అప్డేట్ చేసుకోకపోతే నెట్ వర్క్ నిలిచిపోతుందని నమ్మబలికాడు. బాధితురాలు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా సైబర్ కేటుగాడు చెప్పిన ప్రాసెస్ ఫాలో అయింది.
సిమ్ అప్ గ్రేడ్ పేరుతో అతడు పంపిన ఓటీపీలను చెప్పింది. తర్వాత నిందితుడు మీ మొబైల్నెట్వర్క్30 నిమిషాలపాటు నిలిపివేయబడి, 24 గంటల్లో వస్తుందన్నాడు. కానీ, మూడు రోజులైనా నెట్ వర్క్ రాకపోవడంతో అనుమానం వచ్చి క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ చెక్ చేసుకోగా, తన ప్రమేయం లేకుండానే రూ.3.87 లక్షలు డ్రా అయినట్లు బాధితురాలు గుర్తించింది. వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
