- మేఘారెడ్డి, చిన్నారెడ్డి పోటాపోటీ విమర్శలు
- మరో జీవన్‌రెడ్డిలా మారుతానని ప్రణాళికా సంఘం వైస్ ప్రెసిడెంట్ చిన్నారెడ్డి వార్నింగ్
- హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తామంటున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు ముదురుతోంది. మాజీ మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆదివారం గోపాల్‌పేటలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీశాయి. తనకు సహనం నశిస్తే మరో జీవన్‌రెడ్డిలా మారుతానని, 2023 ఎన్నికల్లో తనకు టికెట్ కన్ఫర్మ్ అయినా, డబ్బులు ఇచ్చి మేఘారెడ్డి టికెట్ తెచ్చుకున్నారని ఆరోపించారు. తాను ప్రతిపాదించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని విమర్శించారు.
తాను 40 ఏళ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా తనకు కాకుండా పార్టీ జెండా మోయనివారికి, ఆయారాం.. గయారాంలకు టికెట్లు ఇచ్చారని చిన్నారెడ్డి మండిపడ్డారు. తన వద్ద డబ్బులు లేవని, డబ్బులు ఉన్నవారికే టికెట్లు ఇచ్చారని గతంలో జరిగిన పార్టీ సమావేశాల్లోనూ ఆయన పేర్కొన్న విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తుచేస్తున్నాయి. తాజా వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య విభేదాలు మరింతగా ముదిరాయని పేర్కొంటున్నాయి. ఘాటుగా
స్పందించిన మేఘారెడ్డి..చిన్నారెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సోమవారం ఘాటుగా స్పందించారు. తాను యూత్ కాంగ్రెస్ నేతగా ఉన్నప్పుడే సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని టికెట్ తెచ్చుకున్నానని చెప్పారు. ఏడు సార్లు పోటీ చేసిన చిన్నారెడ్డి హైకమాండ్‌కు ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి టికెట్లు తెచ్చుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
తాను టికెట్ కోసం ఎవరికి డబ్బులు ఇచ్చానో నిరూపించాలని డిమాండ్ చేశారు. వనపర్తి సెగ్మెంట్‌లో కాంగ్రెస్ గెలిచినప్పటి నుంచి చిన్నారెడ్డి బీఆర్‌ఎస్ నాయకులకే సీఎంఆర్‌ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులు ఇప్పిస్తున్నారని మేఘారెడ్డి ఆరోపించారు. వారికే పనులు చేయిస్తూ మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డిల ఆత్మగా పని చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న చిన్నారెడ్డిపై పార్టీ హైకమాండ్‌కు, క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆయనపై చర్యలు తీసుకునే వరకూ పోరాడతానని మేఘారెడ్డి స్పష్టం చేశారు.
