- మున్సిపల్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ
- 85 మున్సిపాలిటీలు ‘హస్త’గతం!.. మరో 10కి పైగా స్థానాలను ‘చే’జిక్కించుకునే చాన్స్
- 4 కార్పొరేషన్ల పైనా కాంగ్రెస్ జెండా రెపరెపలు
- కొత్తగూడెంలో కమ్యూనిస్టులతో కలిసి పాగా
- కరీంనగర్ కార్పొరేషన్‌లో ‘కమల’ వికాసం
- నిజామాబాద్ మేయర్ పీఠం
- ఎవరికి దక్కుతుందోననే ఉత్కంఠ
- 15 మున్సిపాలిటీలకే బీఆర్ఎస్ పరిమితం
- రెండు మున్సిపాలిటీల్లోనే బీజేపీ ఆధిక్యత
- ఇండిపెండెంట్లు కలిసొస్తే మరో 3 చోట్ల చాన్స్
- కవిత ఖాతాలో వడ్డేపల్లి మున్సిపాలిటీ
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికార పార్టీ హవా కొనసాగింది. 85 మున్సిపాలిటీలను హస్తం పార్టీ చేజిక్కించుకున్నది. మరో10 చోట్ల ఇండిపెండెంట్లు, ఎంఐఎం, ఇతర పార్టీల తరఫున గెలిచిన అభ్యర్థుల మద్దతుతో చైర్పర్సన్పీఠాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్పొరేషన్ల విషయానికి వస్తే మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో మేయర్ పీఠాలు దక్కించుకోనున్నది. కొత్తగూడెంలో సీపీఐతో కలిసి పాగా వేసేందుకు పావులు కదుపుతున్నది. ముఖ్యంగా నిజామాబాద్‌లో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో కేవలం 15 మున్సిపాలిటీలకే పరిమితమైంది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్ల, ఆ పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీ స్థానమైన గజ్వేల్ మున్సిపాలిటీలను కాపాడుకున్నది. కార్పొరేషన్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ చావు దెబ్బ తిన్నది. ఏడు కార్పొరేషన్లలో ఒక్కచోట కూడా ఆశించిన సీట్లను దక్కించుకోలేక చతికిలపడింది. పోయినసారి పదికి పది కార్పొరేషన్లు గెలుచుకున్నా ఆ పార్టీ ఈ సారి ‘జీరో’గా మిగిలిపోయింది.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మున్సిపల్‌ఎన్నికల్లో సరైన ఫలితాలు సాధించలేకపోయింది. కేవలం 2 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌లో మాత్రమే వికసించింది. నిజామాబాద్‌లో 28 స్థానాలు గెలుచుకున్నా.. కాంగ్రెస్ 17, మజ్లిస్‌కు 14 స్థానాలు రావడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఇక్కడ ఎక్స్‌అఫీ షియోతోపాటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క అభ్యర్థి కీలకం కానున్నారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రె స్ మద్దతుతో సీపీఐ మేయర్ సీటు దక్కించుకోనున్నది. కొత్తగూడెంలో హంగ్ఏర్పడే పరిస్థితి ఉండడంతో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఫోన్ కాల్‌తో సీన్మార్చేశారు. కల్వకుంట్ల కవిత మద్దతుదారులు ఏఐఎఫ్‌బీ పార్టీ తరఫున పోటీ చేసి గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని దక్కించుకున్నారు. ఎప్పటిలాగే భైంసా మున్సిపాలిటీ ఎంఐఎంకే దక్కే చాన్స్ కనిపిస్తున్నది.
పకడ్బందీగా కౌంటింగ్..
ఈ నెల11న రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం 123 సెంటర్లలో పకడ్బందీగా జరిగింది. మున్సిపాలిటీలకు 3 రౌండ్లు, కార్పొరేషన్లలో 5 రౌండ్లపాటు కౌంటింగ్నిర్వహించారు. గెలిచిన వాళ్లకు రిటర్నింగ్ఆఫీసర్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. కౌంటింగ్ సూపర్ వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు ఇతర సిబ్బంది అంతా కలిసి 10,800 మంది ఉద్యోగులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోల పర్యవేక్షణలో కౌంటింగ్ సవ్యంగా సాగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
16న చైర్ పర్సన్, మేయర్ల ఎన్నిక
ఈ నెల 16న 116 మున్సిపాలిటీల చైర్ పర్సన్లు, ఏడు కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఒక్కో మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో మొత్తం వార్డు సభ్యులతోపాటు ఆ రోజు మీటింగ్‌కు అటెండ్అయ్యే ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లతో కలిపి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థిని మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్లు, డిప్యూటీ చైర్పర్సన్లుగా ఎన్నుకుంటారు.
అంతటా కాంగ్రెస్సే
దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 16, ఉమ్మడి మహబూబ్ నగర్లో 16, ఖమ్మం జిల్లాలో 7, రంగారెడ్డి జిల్లాలో 6 మున్సిపాలిటీలను గెలుచుకున్నది. బీఆర్‌ఎస్ బలంగా ఉందని భావించిన మెదక్ జిల్లాలో సైతం 7 మున్సిపా లిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. ఉత్తర తెలంగాణలో కూడా కాంగ్రెస్ స్ట్రైక్ రేట్బాగానే ఉంది. బీజేపీకి పట్టున్న ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్జిల్లాలో కూడా ఆ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 10, నిజామాబాద్ జిల్లాలో 8, వరంగల్ జిల్లాలో 6, ఆదిలాబాద్ జిల్లాలో 4 చోట్ల గెలిచి.. పార్టీ అభ్యర్థులను చైర్ పర్సన్ పీఠాలపై కూర్చోబెట్టనున్నది. జగిత్యాల జిల్లా ధర్మపురి, నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపాలిటీల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలవలేదు.
15 చోట్ల బీఆర్ఎస్ కు మెజారిటీ
మున్సిపల్ ఎన్నికల్లో 774కి పైగా స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. అయినా, కేవలం 15 మున్సిపాలిటీల్లో మాత్రమే ఆ పార్టీకి చైర్ పర్సన్ పీఠాలు దక్కనున్నాయి. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూడు దఫాలుగా 9 రోజులు సిరిసిల్లలోనే మకాం వేయడంతో మెజారిటీ స్థానాలు దక్కాయి. ఇక్కడ కేకే మహేందర్‌రెడ్డి పాచిక పారలేదు. మెదక్‌లాంటి గులాబీ కంచుకోటలో కూడా మిశ్రమ ఫలితాలు వచ్చాయి. బీఆర్ఎస్ ఒంటరిగా 50 శాతానికి పైగా సీట్లు గెలిచినా.. గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, కోరుట్ల, ఐజ, సిరిసిల్ల, తిరుమలగిరి, ఇబ్రహీంపట్నం, మూడుచింతలపల్లి, తొర్రూర్, చేర్యాల, దుబ్బాక, తూప్రాన్, అమనగల్, గజ్వేల్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ పీఠాలు అధిరోహించే అవకాశాలున్నాయి. మరికొన్ని చోట్ల బీజేపీ, ఇండిపెండెంట్ల సహకారం తీసుకుంటే మరో ఐదారు మున్సిపాలిటీలు దక్కే చాన్స్ ఉన్నా.. అధికార కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల వ్యూహాలు ఆ అవకాశం దక్కకుండా చేసే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్‌తో పాటు బీఆర్‌ఎస్ కూడా ఎక్కడికక్కడ ఇండిపెండెంట్లను తమ పార్టీల్లో చేర్చుకోవడానికి అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు కూడా తెరతీశారు. పలుచోట్ల ఇండిపెండెంట్అభ్యర్థులు తమవాడంటే.. తమ వాడంటూ గొడవలకు దిగుతున్నారు.
17 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ నో లీడ్
కౌంటింగ్ ముగిశాక 17 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో అక్కడ చైర్పర్సన్ఎన్నిక పార్టీలకు సవాల్‌గా మారనున్నది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, క్యాతన్‌పల్లి, నర్సాపూర్, అమరచింత, ఇస్నాపూర్, జహీరాబాద్, మహబూబాబాద్, మెట్‌పల్లి, జిన్నారం, ఆలియాబాద్, కాగజ్‌నగర్, ఖానాపూర్, ఎల్లంపేట్, జనగామ, కేసముద్రం, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. ఇక్కడ ఇండిపెండెంట్లు, ఇతర పార్టీల అభ్యర్థుల సహకారం తీసుకోవాల్సి వస్తున్నది. దీంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి.
ఒక కార్పొరేషన్, 2 మున్సిపాలిటీల్లో బీజేపీ
రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన కరీంనగర్ కార్పొరేషన్‌ను బీజేపీ గెలుచుకున్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంతా తానై అభ్యర్థులను విజయం వైపు నడిపించారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ నిజామాబాద్‌లో పట్టు సాధించి 28 స్థానాలను గెలిపించుకోగా, కాంగ్రెస్17, ఎంఐఎం 14 స్థానాలతో గట్టి పోటీ ఇచ్చి నిలబడ్డాయి. ఎంఐఎం పొత్తు కాంగ్రెస్‌కు కలిసి వచ్చే అవకాశాలు ఉండగా, ఇక్కడ ఎక్స్అఫీషియో సభ్యులు ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ మేయర్‌పీఠం ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి ఉంది. నారాయణపేట్, రాయికల్‌లో బీజేపీ చైర్పర్సన్ స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు 330 సీట్లు గెలిచారు. ఇండిపెండెంట్లు, ఎక్స్అఫీషియో సభ్యుల సహకారంతో మరో ఐదారు చోట్ల గెలిచే అవకాశాలున్నాయి. ఇతర పార్టీల అభ్యర్థులతో లోకల్ పొత్తులు కుదిరితే ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణపేట, ఖానాపూర్, అమరచింత తదితర మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ సీట్లను గెలుచుకోవచ్చు.
ఎంఐఎంకు భైంసా..
కవిత పార్టీకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
ఎప్పటిలాగే భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం గెలుచుకున్నది. ఇక్కడ 26 సీట్లకు ఎంఐఎం12 సీట్లు గెలిచింది. బీజేపీ6 సీట్లకే పరిమితం కాగా కాంగ్రెస్, ఇండిపెండెంట్ల సపోర్ట్‌తో ఎంఐఎం మరోసారి చైర్పర్సన్ సీటు దక్కించుకోనున్నది. కల్వకుంట్ల కవిత మొదటి ఎన్నికల్లోనే బోణీ కొట్టింది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 సీట్లు ఉండగా ఇక్కడ ఏఐఎఫ్‌బీ పార్టీ గుర్తులపై పోటీచేసిన కవిత మద్దతుదారులు 8 మంది గెలిచారు. దీంతో ఎలాంటి సపోర్ట్ లేకుండానే ఆ పార్టీ చైర్ పర్సన్, డిప్యూటీ చైర్ పర్సన్ సీట్లను గెలుచుకోనున్నది.
కాంగ్రెస్‌కు సగానికి పైగా సీట్లు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 2,996 స్థానాలు ఉండగా.. 50 శాతానికిపైగా సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులే గెలుచుకున్నారు. కాంగ్రెస్ 1,538, బీఆర్ఎస్ 781, బీజేపీ 335 సీట్లను గెలుచుకుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. తర్వాత అత్యధికంగా ఇండిపెండెంట్లు 183 చోట్ల గెలుపొందారు. సీపీఎం 13, ఎంఐఎం 70, బీఎస్పీ 2, ఏఐఎఫ్‌బీ, సీపీఐ తదితర రాజకీయ పార్టీల అభ్యర్థులు 73 మంది గెలుపొందారు. మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ క్యాండిడేట్ సూసైడ్ చేసుకోగా.. ఆ వార్డు స్థానాన్ని ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
4 కార్పొరేషన్లు కాంగ్రెస్ వైపే
7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ 4 స్థానాల్లో ఒంటరిగానే మెజారిటీ సాధించింది. నల్గొండ, రామగుండం, మంచి ర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్లలో జెండా ఎగురవేసింది. నల్గొండలో మొత్తం 48 సీట్లకు 27 చోట్ల, రామగుండంలో 60 సీట్లకు 38, మంచిర్యాలలో 60 సీట్లకు 44 స్థానాల్లో గెలుపొందింది. మహబూబ్ నగర్లో కూడా ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సహకారంతో కొత్తగూడెం కార్పొరేషన్‌పై ఎర్రజెండా ఎగురనున్నది. ఇక్కడ 60 సీట్లకు కాంగ్రెస్, సీపీఐకి చెరో 22 సీట్లు వచ్చాయి. ముందుగా బీఆర్ఎస్తో సీపీఐ పొత్తు పెట్టుకొని ఎన్నికలకు పోయింది. కానీ, బీఆర్‌ఎస్‌కు కేవలం 8 సీట్లు మాత్రమే వచ్చాయి. రెండు పార్టీలకు కలిపి మెజారిటీ రాకపోవడంతో సీఎం రేవంత్ స్వయంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావుకు ఫోన్ చేసి మాట్లాడారు. తాము మద్దతిస్తామని చెప్పడంతో సీపీఐ ఊపిరి పీల్చుకున్నది. పోలింగ్‌కు ముందు మొదట ఎవరికివారుగా పనిచేసినా చివరికి కలవడంతో రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరినట్లయింది. ఈ పరిణామంతో బీఆర్ఎస్ ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నది.
కాంగ్రెస్‌కు అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం లక్షలాది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ ఫలితం. పార్టీపై వారికున్న అనంతమైన అభిమానానికి నిదర్శనం. భుజాలు కాయలు కాసేలా పార్టీ జెండాను మోసి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లిన ప్రతి కార్యకర్తకు ఈ విజయం అంకితం. - -- సీఎం రేవంత్
మున్సిపాలిటీలు 116 , కార్పొరేషన్లు 07
కాంగ్రెస్ 04
రామగుండం
మహబూబ్‌నగర్
మంచిర్యాల
నల్గొండ
సీపీఐ+
కాంగ్రెస్ 01 కొత్తగూడెం
బీజేపీ 01 కరీంనగర్
బీఆర్ఎస్ 0
హంగ్ 01 నిజామాబాద్
