
హైదరాబాద్: టాలీవుడ్‌లో సోమవారం నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. 30 శాతం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. వేతనాలు పెంచితేనే షూటింగ్స్‌లో పాల్గొంటామని TFI ఉద్యోగులు స్పష్టం చేశారు. వేతనాలు పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని, ఇతర భాషా సినిమాలు, వెబ్‌సిరీస్‌లకూ కూడా ఈ రూల్ వర్తిస్తుందని తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ తేల్చి చెప్పింది.
తెలుగు సినీ పరిశ్రమలో వేతనాల పెంపుదల వ్యవహారం ఇటీవల టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలుగు సినీ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు ఇప్పటికే లేబర్ కమిషనర్‌ను కలిశారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని కార్మికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
Also Read : నటి రమ్యకు ఆన్ లైన్ లో బెదిరింపుల కేసులో ఇద్దరు అరెస్ట్
వేతనాలు పెంచకపోతే షూటింగ్స్ బంద్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలను పెంచుతామని తెలుగు సినీ నిర్మాతలు గతంలో హామీ ఇచ్చారు. అయితే ఆ హామీలు నెరవేరడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. షూటింగ్స్ బంద్ అయ్యే పరిస్థితులు ఉండటంతో దసరాకు విడుదల కాబోతున్న పెద్ద సినిమాల పరిస్థితి ఏంటని టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది.
దసరా టార్గెట్గా అఖండ2, OG సినిమాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల షూటింగ్ ఆల్ మోస్ట్ కంప్లీట్ కావొచ్చింది. ఈ టైంలో.. బంద్ ఎఫెక్ట్ తో సినిమాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది.