బీఆర్‌‌ఎస్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణ!

బీఆర్‌‌ఎస్‌‌పై ప్రజాభిప్రాయ సేకరణ!

ప్రత్యేక టీంలను రంగంలోకి దించి అన్ని జిల్లాల్లో సర్వే
ఏపీలో ఆదరణ ఉంటుందా అనే దానిపై ఆరా
నేతల చేరిక ఎంతమేరకు ప్రభావం చూపిస్తుంది? 
దళితబంధు, ఇతర హామీలపై 
ఏమనుకుంటున్నరనే దానిపై ఫోకస్


హైదరాబాద్‌‌ : ఆంధ్రప్రదేశ్‌‌లో తెలంగాణ ఇంటెలిజెన్స్‌‌ అడుగుపెట్టింది. బీఆర్‌‌ఎస్‌‌లో ఏపీ నేతల చేరిక తర్వాత ఆ రాష్ట్రంపై ఫోకస్‌‌ పెట్టింది. ఇంటెలిజెన్స్‌‌ విభాగం అధికారులు స్పెషల్‌‌ టీంలుగా ఏర్పడి అన్ని జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణలో నిమగ్నమయ్యారు. సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని కేసీఆర్ పైకి చెప్తున్నా.. అసలు బీఆర్‌‌ఎస్‌‌కు ఏపీలో ఆదరణ ఉంటుందా అనే దానిపై ఆరా తీస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌ విభజనకు కారకుడైన కేసీఆర్‌‌ను నాయకుడిగా ఏపీ ప్రజలు ఆమోదిస్తారా అనే అంశంపై దృష్టి సారించారు. వెల్ఫేర్‌‌లో తెలంగాణ మోడల్‌‌.. ముఖ్యంగా దళితబంధుపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? బీఆర్ఎస్‌‌కు ఏపీ ప్రజలు అండగా నిలవాలనే పిలుపుపై అక్కడ ఏమంటున్నారు? అనే అంశాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు.

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ సమక్షంలో కాపు, దళిత సామాజిక వర్గాలకు చెందిన నేతలు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. వారి చేరిక ఆయా కులాలపై ఎంతమేరకు ప్రభావం చూపిస్తుంది? దళితబంధు, 24 గంటల ఉచిత కరెంట్‌‌‌‌‌‌‌‌ హామీలపై కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? అనే దానిపై ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాలు ఆరా తీస్తున్నాయి. మంగళవారం ఉదయమే రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ టీంలు రంగంలోకి దిగగా, మరికొన్ని బృందాలు మధ్యాహ్నం తర్వాత ఫీల్డ్‌‌‌‌‌‌‌‌లో అడుగు పెట్టాయి. తాము సేకరించిన సమాచారాన్ని ఎవరికి వారు ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌కు చేరవేసినట్టుగా తెలిసింది. ఇంకో రెండు, మూడు రోజుల పాటు ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ టీంలు ఏపీలోనే ఉండి మారుమూల గ్రామాల్లోకి సైతం వెళ్లి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌పై ప్రజాభిప్రాయం సేకరించవచ్చని తెలుస్తున్నది. ఆంధ్ర ప్రజల స్పందనపై మంగళవారం రాత్రే ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నతాధికారులు ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు నివేదించినట్టుగా సమాచారం.

రెండు కులాలపై ఫోకస్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వస్తేనే పోలవరం నిర్మాణం పూర్తవుతుందనే ప్రచారం ఏ మేరకు ప్రజల్లో ప్రభావం చూపించిందనే కోణంలోనూ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు సమాచారం సేకరిస్తున్నారు. ఏపీలో రెడ్డి కులం వైసీపీ వైపు, కమ్మ కులం టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నది. కాపుల పార్టీగా జనసేన ఎమర్జ్‌‌‌‌‌‌‌‌ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. ఇదే సమయంలో కాపులతో పాటు దళితులపై కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ప్రధానంగా ఫోకస్‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ రెండు కులాల నుంచి మెజార్టీ ఓట్లు తెచ్చుకోగలిగితే ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చనేది కేసీఆర్‌‌‌‌‌‌‌‌ వ్యూహంగా కనిపిస్తున్నది. ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ అధికారులు కూడా కాపు, దళిత కాంబినేషన్‌‌‌‌‌‌‌‌పైనే ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌‌‌‌‌‌‌‌ పేరు పెట్టడంతో హింస చెలరేగింది. ఆ ప్రభావం ఒక్క కోనసీమ జిల్లాకే పరిమితం అవుతుందా.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి సహా ఇతర జిల్లాలపైనా ఉందా అనే దానిపైనా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు. ఏపీలోని ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి, విభజన సమస్యలపై కేసీఆర్ గతంలో వ్యవహరించిన తీరుపైనా ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపైనా ఆరా తీస్తున్నారు.

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభావం ఎంత?

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిచినా చివరికి ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీలో మిగిలారు. అదే ఎన్నికల్లో ఖమ్మం లోక్‌‌‌‌‌‌‌‌సభతో పాటు మూడు ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచిన వైఎస్సార్‌‌‌‌‌‌‌‌ సీపీ ఆ తర్వాత ఇక్కడి రాజకీయాలకు పూర్తిగా దూరమైంది. 2018 ఎన్నికల్లో ఊపుమీద కనిపించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌.. చంద్రబాబుతో జట్టు కట్టి దారుణంగా దెబ్బతింది. ఏపీ మూలాలు ఉన్న రాజకీయ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదన్నట్టుగా ఇక్కడి ప్రజలు తీర్పునిచ్చారు. టీడీపీ, వైసీపీ కూడా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా తెలంగాణ రాజకీయాలకు దాదాపు గుడ్‌‌‌‌‌‌‌‌ బై చెప్పేశాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలతో సరిపెట్టుకోగా, వైసీపీ పోటీకే దూరంగా ఉంది. 2018 తర్వాత ఒక్క నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో మాత్రమే టీడీపీ పోటీ చేసి 0.89 శాతం ఓట్లకే పరిమితమైంది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గం నుంచి పోటీకి దిగినా పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. తెలంగాణలో ఏపీకి చెందిన పార్టీలు ప్రాభవం కోల్పోవడంతో తెలంగాణకు చెందిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌ ఆంధ్రాలో ఏమేరకు ఉంటుందనే దానిపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్నారు.

కేకేతో ఏపీ బీఆర్ఎస్ నేతలు భేటీ

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుతో హైదరాబాద్ లోని ఆయన నివాసంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, నేతలు రావెల కిషోర్ బాబు, పార్థ సారథి, ప్రసాద్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ, దేశ రాజకీయాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు.

గుణాత్మక మార్పు అంటే ఏంటి?

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దీటుగానే ఏపీలోనూ వెల్ఫేర్‌‌ స్కీములున్నాయి. విద్య, వైద్యంపై అక్కడి ప్రభుత్వమే కాస్త ఎక్కువ ఎఫర్ట్‌‌ పెడుతున్నదని ప్రజాభిప్రాయం ఉన్నట్టు తెలుస్తున్నది. ఒక్క దళితబంధు మాత్రమే అక్కడ అమలు కావడం లేదు. ఇంటెలిజెన్స్‌‌ అధికారులు కేసీఆర్‌‌ ఎంట్రీపై అడిగితే.. ఏపీ ప్రజలు డైరెక్ట్‌‌గా రియాక్ట్‌‌ కావడం లేదని సమాచారం. కొందరు మాత్రం ఆయనకు ఏపీలో ఎంట్రీ దొరకదని తేల్చిచెప్తున్నట్టు తెలిసింది. కేసీఆర్‌‌ చెప్తున్న ప్రత్యామ్నాయ మోడల్‌‌, గుణాత్మక మార్పు అంటే ఏమిటో అర్థమయ్యేలా చెప్పాలంటూ కొందరు ఇంటెలిజెన్స్‌‌ అధికారులను ఉల్టా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.