- ఈ నెల 26 నుంచి 28 వరకు స్థలాలు, ఇండ్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
- సర్వర్ అప్‌గ్రేడేషన్, సాంకేతిక నిర్వహణ పనుల నేపథ్యంలో నిర్ణయం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు రిజిస్ట్రేషన్ సేవలు నిలిపివేయనున్నారు. సర్వర్ అప్‌గ్రేడేషన్, సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్థలాలు, ఇండ్లు, ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరగవు. శాఖ వెబ్‌సైట్‌తో పాటు ఆన్‌లైన్ సేవలు కూడా అందుబాటులో ఉండవని అధికారులు చెప్పారు.
దాదాపు ఐదేళ్ల తర్వాత సర్వర్లను పూర్తిస్థాయిలో అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఐజీ తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ సేవలు మరింత వేగంగా, సురక్షితంగా అందుతాయన్నారు. సర్వర్ల పనితీరు కూడా మెరుగుపడుతుందని చెప్పారు. అత్యవసరంగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సిన వారు జూన్ 26కు ముందే తమ పనులు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. జూన్ 29 నుంచి అన్ని రిజిస్ట్రేషన్ సేవలు మళ్లీ యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు.
