V6 News

డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు!.. బాలింత మృతి

డెలివరీ చేసిన స్టాఫ్ నర్సు!..   బాలింత మృతి

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చిన ఓ గర్భిణికి డాక్టర్ పర్యవేక్షణ లేకుండా స్టాఫ్ నర్సు డెలివరీ చేయడంతో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం బాలింత చనిపోయింది. ఇందుకు ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. పాలమాకుల గ్రామానికి చెందిన పావని(28) డెలివరీ కోసం శంషాబాద్ ప్రభుత్వాసుత్రిలో చేరింది. శనివారం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో డాక్టర్లు రాకముందే స్టాఫ్ నర్సులు డెలివరీ చేశారు. 

పావని మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, బాబును పురిటి పేగు బయటికి రాకపోవడంతో నర్సులు బలంగా దాన్ని లాగారని.. దీంతో రక్తం బాగాపోయి పావని అపస్మారక స్థితిలోకి చేరుకుందని ఆమె బంధువులు చెబుతున్నారు. వెంటనే పావనిని సిటీలోని మరో హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయిందన్నారు. పావని మృతికి శంషాబాద్  ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్ చేశారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి కంప్లయింట్ అందలేదని శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు తెలిపారు.