V6 News

రిలయన్స్ లాభం డౌన్.. ఆదాయం అప్.. వాటాదారులకు రూ.6 డివిడెండ్!

రిలయన్స్ లాభం డౌన్.. ఆదాయం అప్.. వాటాదారులకు రూ.6 డివిడెండ్!
  • నాలుగో క్వార్టర్ లో రిలయన్స్ లాభాలు తగ్గాయ్
  • రిలయన్స్​ లాభం13 % డౌన్
  • నాలుగో క్వార్టర్లో రూ.16,971 కోట్లు
  • మొత్తం ఆదాయం  రూ.2.98 లక్షల కోట్లు
  • జియో లాభం రూ.7,935 కోట్లు
  • రూ.6 చొప్పున డివిడెండ్ ప్రకటన

న్యూఢిల్లీ: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్) 2026 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ ఫలితాలను శుక్రవారం ప్రకటించింది. ఈ మూడు నెలల్లో కంపెనీ  నికర లాభం (కన్సాలిడేటెడ్​) 13 శాతం తగ్గి రూ.16,971 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే క్వార్టర్‌‌‌‌‌‌లో లాభం రూ.19,407 కోట్లుగా ఉంది. కంపెనీ కార్యకలాపాల ఆదాయం 13 శాతం వృద్ధితో రూ.2.98 లక్షల కోట్లకు చేరింది. బోర్డు ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ సిఫార్సు చేసింది.  

టెలికం విభాగం జియో ఆపరేటింగ్ ఆదాయం 13 శాతం పెరిగి రూ.44,928 కోట్లుగా నమోదైంది. లాభం కూడా 13 శాతం వృద్ధితో రూ.7,935 కోట్లకు చేరింది.   రిటైల్ విభాగం లాభం స్వల్పంగా పెరిగి రూ.3,563 కోట్లుగా నమోదైంది. ఆదాయం 11 శాతం వృద్ధితో రూ.87,344 కోట్లకు చేరింది. ఈ క్వార్టర్‌‌లో కంపెనీ కొత్తగా 333 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం స్టోర్ల సంఖ్య 20,160 కి చేరుకుంది. ఆయిల్ టు కెమికల్స్ (ఓ2సీ) ఆదాయం 12 శాతం పెరిగి రూ.1.84 లక్షల కోట్లుగా ఉంది.  

ఆయిల్ అండ్ గ్యాస్ విభాగం ఆదాయం 9 శాతం తగ్గి రూ.5,867 కోట్లుగా నమోదైంది. కేజీ–డీ6 బేసిన్ లో గ్యాస్ ధరలు తగ్గడం  ప్రభావం చూపింది. జియోస్టార్ రూ.9,784 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. టెలివిజన్ రంగంలో 34.2 శాతం కస్టమర్లతో ఈ నెట్​వర్క్ మొదటిస్థానంలో కొనసాగుతోంది