
ఘట్ కేసర్, వెలుగు: రూ.3 కోట్లకుపైగా నిధులను కాజేసిన బిల్ కలెక్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఘట్ కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్ సీ నగర్ కు చెందిన కొంపల్లి హేమంత్ కుమార్ 2007 నుంచి బిల్ కలెక్టర్ గా చేస్తున్నాడు. అధికారుల వద్ద నమ్మకమైన వ్యక్తిగా పేరుపొందాడు. 2021 నుంచి 2023 వరకు అప్పటి మున్సిపల్ కమిషనర్లు వసంత, వేమనరెడ్డి, మేనేజర్ అంజిరెడ్డిలను బురిడి కొట్టించాడు.
ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కింద వసూలైన రూ.3. 13 కోట్లను మున్సిపాలిటీ బ్యాంక్ అకౌంట్ జమ చేయకుండా దారిమళ్లించాడు. 2023 ఆగస్టులో కమిషనర్ గా వచ్చిన సాబేర్ అలీ ఆడిట్ చేయించగా డబ్బులు జమ కాలేదని తేలింది. ఇది హేమంత్ కు తెలియడంతో పరార్ అయ్యాడు. కమిషనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా మంగళవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. మరికొంత మందిని విచారించి నిందితుడు హేమంత్ కుమార్ ను కోర్టు అనుమతితో కస్టడీ లోకి తీసుకుని విచారిస్తామని పోలీసులు తెలిపారు.