ఇబ్బంది పడుతున్న పేషెంట్ల సహాయకులు

ఇబ్బంది పడుతున్న పేషెంట్ల సహాయకులు

హాస్పిటల్​ సెల్లార్​లో అధ్వానంగా డ్రైనేజీ వ్యవస్థ 

పద్మారావునగర్, వెలుగు: గాంధీ హాస్పిటల్​లో కొత్తగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహానికి అడ్డుగా ఉందని మెయిన్​ గేట్ ఎదురుగా  రోడ్డు పక్కనున్న ఆర్టీసీ బస్ షెల్టర్ ను  అధికారులు తొలగించారు. దీంతో గాంధీ హాస్పిటల్​కు వచ్చే  పేషెంట్లు, వారి సహాయకులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైనే నిల్చోని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు గాంధీ హాస్పిటల్​లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. గాంధీ హాస్పిటల్ ఆవరణలో బ్యూటిఫికేషన్ పనులకు దాదాపు రూ.రెండున్నర కోట్లు ఖర్చు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండగా.. మురికి నీరు సెల్లార్​లోకి పొంగి రావడంతో శానిటేషన్ సమస్యలు తలెత్తుతున్నాయి. తరచూ షార్ట్ సర్క్యూట్​తో ప్రమాదాలు జరుగుతున్నా..  

సెల్లార్​లో డైట్ క్యాంటీన్ అలాగే నడుస్తోంది. సెక్యూరిటీ, శానిటేషన్ విభాగాల్లో సిబ్బంది కొరత ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇలా గాంధీ హాస్పిటల్​లో ఎన్నో సమస్యలున్నాయని వాటిపై సర్కారు ఫోకస్ చేస్తే బాగుంటుందని పేషెంట్లు, వారి సహాయకులు అంటున్నారు. ఇయ్యాల గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం గాంధీ హాస్పిటల్ మెయిన్ గేటు ఎదురుగా ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఇయ్యాల సీఎం కేసీఆర్​ఆవిష్కరించనున్నారు.  విగ్రహావిష్కరణ తర్వాత గాంధీ మెడికల్ కాలేజీ గ్రౌండ్​లో జరిగే బహిరంగ సభలో  సీఎం ప్రసంగించనున్నారు. శనివారం గాంధీ హాస్పిటల్​ను సందర్శించిన మంత్రి తలసాని శ్రీనివాస్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.