General Elections 2024:  మార్చిలో లోక్ సభ ఎన్నికలు?

General Elections 2024:  మార్చిలో లోక్ సభ ఎన్నికలు?
  • ఫిబ్రవరి నెలాఖరున షెడ్యూల్!
  • మే 30 తో ముగియనున్న మోదీ సర్కారు పదవీ కాలం
  • ముందస్తుకు వెళ్లే ఆలోచనలో కేంద్రం
  • ఆపరేషన్ ప్రారంభించిన బీజేపీ 
  • సౌత్ పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి
  • మీటింగ్స్ స్టార్ట్ చేసిన బీఆర్ఎస్

హైదరాబాద్: వచ్చే ఏడాది మార్చిలో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలాఖరు నాటికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రధాని మోదీ ప్రభుత్వం పదవీకాలం మే 30 తో ముగియనుంది. కానీ ముందస్తుకు ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ నుంచి చేజిక్కించుకుంది. తెలంగాణలోనూ గణనీయమైన ఓట్ల శాతం పొందింది. ఏప్రిల్ తర్వాత ఎండలు మండిపోయే అవకాశం ఉంది. అక్కడక్కడా తాగునీటి సమస్యలు తలెత్తవచ్చని అది కాస్తా ఓటర్లపై ప్రభావం చూపవచ్చని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎల్లుండి హైదరాబాద్ కు వస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్దం చేయనున్నారని సమాచారం. ఇందుకోసం బీజేపీ 90 రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నది. మరో వైపు బీఆర్ఎస్ పార్టీ సైతం పార్లమెంటు ఎన్నికలకు  సిద్ధమవుతున్నది. ఇందులో భాగంగా ఆ పార్టీ నిన్న చేవెళ్ల, ఇవ్వాళ మహబూబ్ నగర్ పార్లమెంటు సెగ్మెంట్ల లీడర్లతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

మరో వైపు అధికార కాంగ్రెస్ పార్టీలోనూ అసెంబ్లీ ఎన్నికల గెలుపు ఉత్సాహం కంటిన్యూ అవుతోంది. మార్చి 16 నాటికి ఆరు గ్యారెంటీల​ను అమలు చేసి ప్రజలతో శభాష్​ అనిపించుకొని ముందడుగు వేయాలని భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది.  దక్షిణాదిలో పట్టు పెంచుకున్న కాంగ్రెస్ ఏపీలోనూ పాగా వేసేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఇందుకోసం ఏకంగా ఏఐసీసీ పెద్దలు రంగంలోకి దిగడం గమనార్హం.