వరల్డ్ కప్ వివాదంలో మరో ట్విస్ట్.. ఐసీసీ ముందు పాక్ కొత్త ప్రతిపాదన

వరల్డ్ కప్ వివాదంలో మరో ట్విస్ట్.. ఐసీసీ ముందు పాక్ కొత్త ప్రతిపాదన

ఈ ఏడాది చివరలో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ పాల్గొనడంపై ఇప్పటికీ అనిశ్చితి వీడలేదు. దాయాది దేశం పాకిస్తాన్ రోజుకో కొత్త తలనొప్పి ఐసీసీ ముందు ఉంచుతోంది. ఇప్పుడిప్పుడే ఆసియా కప్ వివాదం సద్దుమణిగిందనుకుంటే.. తాజాగా ఈ వివాదంలో మరో కొత్త ట్విస్ట్ తెరమీదకు వస్తోంది. 

ఇన్నాళ్లూ వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు భద్రతా కారణాలనీ.. చెన్నై, బెంగుళూరు వేదికలను సాకుగా చూపిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఇప్పుడు అసలు విషయాన్ని బయటపెట్టింది. పీసీబీ ఆందోళన ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ కాదు.. 2025లో జరుగాల్సి ఉన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గురుంచి. ఈ టోర్నీ పాక్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, భారత జట్టు ఈ టోర్నీలో పాల్గొనడం అనుమానమే. భద్రతా కారణాల వల్ల అక్కడకు వెళ్లక పోవచ్చు. 

అందుకే పీసీబీ ఇప్పటినుంచే ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. టీమిండియా పాక్ పర్యటనకు రాని పక్షంలో ఆ నష్టాలను  ఐసీసీ భరించాలంటోంది. అందుకు ఐసీసీ తమకు రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. ఇటీవల ఐసీసీ ఛైర్మెన్ గ్రెగ్ బార్క్లే, సీఈవో జెఫ్ అలార్డైస్ లు పాక్ పర్యటనకు వెళ్లినప్పుడు పీసీబీ ఇదే విషయాన్ని వారికి తెలియజేసినట్లు సమాచారం. భారత జట్టు ఎలాగూ తమ దేశం రాదు కాబట్టి ఆ నష్టానికి నష్ట పరిహారం చెల్లించాలని పీసీబీ కోరినట్టు కథనాలు వస్తున్నాయి.  

భారత్- పాక్ మ్యాచ్ అంటేస్టేడియం ఫుల్ అవ్వడమే కాదు.. లక్షల సంఖ్యలో అభిమానులు టీవీలకు అతుక్కుపోతారు. యాడ్‌ల ద్వారా ఎక్కువ మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. ఒకవేళ భారత జట్టు.. పాక్ పర్యటనకు వెళ్లకపోతే పీసీబీ భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది. ఆ నష్టాలను పూడ్చుకునేందుకే పీసీబీ ఈ దారిని పావుగా వాడుకుంటోంది. దీనిపై ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందా? అన్న దాన్ని బట్టి సమస్య పరిష్కారం కానుంది.