వాడివేడిగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ సమావేశం

వాడివేడిగా భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ  సమావేశం
  • పోడు భూములకు పట్టాల సంగతేమైందని నిలదీత
  • అనర్హులకు డబుల్​ బెడ్రూం ఇండ్లు ఇస్తున్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం
  • మీటింగ్​కు నలుగురు ఎమ్మెల్యేలు దూరం 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: హెల్త్​, ఫారెస్ట్​ ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. ఫారెస్ట్​ వాళ్లేమో గిరిజనులను వేధిస్తుంటే, హెల్త్​ డిపార్ట్​మెంట్​ వాళ్లేమో ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారని అసహనం వ్యక్తం చేశారు. అధికార, ప్రతిపక్ష ప్రతినిధులు ఆఫీసర్లను నిలదీయడంతో మంగళవారం చైర్మన్​ కోరం కనకయ్య అధ్యక్షతన జిల్లా పరిషత్​ జనరల్​ బాడీ మీటింగ్​ గరంగరంగా జరిగింది. అనర్హులకు డబుల్​ బెడ్రూం ఇండ్లు మంజూరు చేసినా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీటింగ్​కు నలుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. 

ఆఫీసర్ల తీరుపై ఆగ్రహం

ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు మాట్లాడుతూ 2005కు ముందు నుంచి పోడు భూములు సాగు చేస్తున్న వారికి పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. మణుగూరు గవర్నమెంట్​ హాస్పిటల్​లో డాక్టర్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. డాక్టర్ల నియామకాలకు చర్యలు చేపట్టాలన్నారు. వ్యవసాయ సీజన్​ మొదలవుతున్న తరుణంలో పోడు భూముల్లో హరితహారం పేర రైతులను వేధించవద్దని జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య ఫారెస్ట్​ అధికారులకు సూచించారు. ఇల్లందు మండలం సీతానగరానికి చెందిన గిరిజనులు బోర్లు వేయించుకున్నారని, కరెంట్​ కనెక్షన్​ ఇవ్వకుండా ఫారెస్ట్​ వాళ్లు అడ్డుకోవడం దారుణమన్నారు. వారం కిందట చెట్టుపల్లి ప్రాంతంలో ఫారెస్ట్​ ఆఫీసర్లు గిరిజనులను వేధిస్తున్నారని ఎంపీపీ ముక్తి సత్యం వాపోయారు.

జడ్పీ మీటింగ్​లలో చర్చించుకోవడం తప్ప అమలులో ఫారెస్ట్​ ఆఫీసర్లు వేరేలా వ్యవహరిస్తున్నారని జడ్పీటీసీలు మేరెడ్డి వసంత, సున్నం నాగమణి, పి వెంకటేశ్వర్లు ఆరోపించారు. రెవెన్యూ, ఫారెస్ట్​ భూముల వివాదాన్ని పరిష్కరించకపోవడంతోనే గొడవలు జరుగుతున్నాయని జడ్పీటీసీ వెంకటరెడ్డి అన్నారు. ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూముల్లో ఫారెస్ట్​ వాళ్లు మొక్కలు నాటడం ఏమిటని ప్రశ్నించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో ఫారెస్ట్​ సిబ్బంది గిరిజన మహిళలపై దాడి చేయడంతో పాటు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్​డీవో అబ్బయ్య మాట్లాడుతూ గతంలో ఏర్పాటు చేసిన ట్రెంచ్​ లోపలే హరితహారం మొక్కలు నాటుతామని తెలిపారు. వైద్య శాఖపై ప్రతీ మీటింగ్​లో చర్చించుకుంటున్నా ఎలాంటి మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. చండ్రుగొండ మండలంలో సర్పంచ్​ ఆత్మహత్యాయత్నం చేసుకుంటే కొత్తగూడెం గవర్నమెంట్​ హాస్పిటల్​కు తీసుకొస్తే పట్టించుకొనే వారే కరువయ్యారని జడ్పీటీసీ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

హాస్పిటల్​ సూపరింటెండెంట్​ ఫోన్​ లిఫ్ట్​ చేయడం లేదని ఆరోపించారు. ఆసుపత్రికి వచ్చిన వాళ్లను ప్రైవేట్​ హాస్పిటల్స్​కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు. అశ్వారావుపేట హాస్పిటల్​కు ఎంపీ నామా నాగేశ్వరరావు అంబులెన్స్​ ఇచ్చినా డ్రైవర్​ లేకపోవడంతో నిరుపయోగంగా మారిందని తెలిపారు. 104 సిబ్బందికి సంబంధించి రూ.60 లక్షల పీఎఫ్​ డబ్బులు గోల్ మాల్​ అయ్యాయని జడ్పీ మీటింగ్​లో ఆఫీసర్ల దృష్టికి తెచ్చినా స్పందించడం లేదని మండిపడ్డారు. హాస్పిటల్స్​లలో పర్మినెంట్, ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో ఎంత మంది పని చేస్తున్నారనే వివరాలు అడిగినా, ఇవ్వడం లేదని జడ్పీ చైర్మన్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. చండ్రుగొండ పంచాయతీలో డబుల్​ బెడ్రూం ఇండ్లలో అనర్హులున్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని వాపోయారు. అడిషనల్​ కలెక్టర్​ కె వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో విద్యాలత, జడ్పీ వైస్​చైర్మన్​ కంచర్ల చంద్రశేఖర్, లైబ్రరీ చైర్మన్​ దిండిగాల రాజేందర్​పాల్గొన్నారు. 

ఎమ్మెల్యేల గైర్హాజరు

జడ్పీ మీటింగ్​కు ఐటీడీఏ పీవోతో పాటు కొత్తగూడెం, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, బానోత్​ హరిప్రియ, మెచ్చా నాగేశ్వరరావు, పొదెం వీరయ్య రాకపోవడం పట్ల పలువురు జడ్పీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులతో పాటు జడ్పీటీసీలు, ఎంపీపీలు పాల్గొనే జడ్పీ మీటింగ్​కు ఎమ్మెల్యేలు దూరంగా ఉండడం సరైంది కాదన్నారు. ఇదిలాఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే జడ్పీ ఆఫీస్​సమీపంలో జరిగిన ఓ ప్రైవేట్​ ప్రోగ్రాంలో పాల్గొని, జడ్పీ మీటింగ్​కు రాకపోవడంపై పలువురు చర్చించుకోవడం కనిపించింది.