భూకంప శిథిలాల కింది నుంచే వాట్సాప్ స్టేటస్..

భూకంప శిథిలాల కింది నుంచే వాట్సాప్ స్టేటస్..
  • రెస్క్యూ ఆపరేషన్​లతో రక్షిస్తున్న సిబ్బంది
  • టర్కీ, సిరియాలో మృతులు 28వేల మంది
  • కొనసాగుతున్న సహాయక చర్యలు
  • యూట్యూబర్ ను గుర్తించి, కాపాడిన రెస్క్యూ సిబ్బంది

అంటాక్యా (టర్కీ): సిరియా, టర్కీని భూకంపం కుదిపేసి వారం రోజులవుతున్నది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా కష్టపడుతున్నారు. కూలిన సిమెంట్​ దిమ్మెల కింద ఇరుక్కుపోయిన వారు తమ మొబైల్​ను ఉపయోగించి, సోషల్ మీడియా ద్వారా సాయం కోరుతూ  ప్రాణాలు కాపాడుకుంటున్నారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్​లోడ్ చేస్తున్నారు. దీంతో వారిని గుర్తించి రెస్క్యూ సిబ్బంది సేఫ్​గా బయటికి తీస్తున్నారు. ఇస్తాంబుల్​కు చెందిన 20 ఏండ్ల బిరాన్ కుబాత్, వాట్సాప్​తో ప్రాణాలు దక్కించుకున్నాడు. భూకంపం తర్వా త కుబాత్ బండ రాళ్ల కింద చిక్కుకుపోయాడు. ఫోన్ తనవద్దే ఉండటంతో వీడియో తీసి వాట్సాప్​ స్టేటస్​లో పెట్టాడు. ‘‘ఎవరైనా ఈ స్టేటస్ చూస్తుంటే ప్లీజ్.. నన్ను కాపాడండి. బండరాళ్ల కింద ఇరుక్కుపోయా. హెల్ప్​ చేయండి” అంటూ స్టేటస్​ పెట్టడంతో రెస్క్యూ సిబ్బంది అతడున్న ప్రాంతాన్ని గుర్తించి కుబాత్​ను కాపాడారు. కుబాత్ తల్లిని బయటికి తీశారు. మరో ఘటనలో ఓ యూట్యూబర్ ఫిరత్ యాయ్లా ప్రాణాలు కాపాడుకున్నాడు. ‘‘ఫ్రెండ్స్ మేము బండ రాళ్ల మధ్య చిక్కుకున్నాం. ప్లీజ్ హెల్ప్ చేయండి” అని అడ్రస్ చెబుతూ ఇన్​స్టాలో కోరాడు. ఇది చూసి రెస్క్యూ సిబ్బంది ఫిరత్​ను కాపా డారు. ఇలా కొందరు సోషల్ మీడియాతో బయటపడుతున్నారు.

తినడానికి తిండి లేదు

భూకంప బాధితుల కోసం అక్కడి ప్రభుత్వం గాజియెన్​టెప్​లోని మున్సిపల్ స్టేడియంలో టెంపరరీ క్యాంపులు ఏర్పాటు చేసినా సౌలత్​లు లేవు. ఫుడ్, వాటర్, బ్లాంకెట్లు, స్వెటర్లు లేకపోవడంతో ప్రాణాలు కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. ‘గ్యాస్, హీటింగ్ సిస్టమ్, ఎలక్ట్రిసిటీ లేదు. ఏమైనా కొందామన్న డబ్బుల్లేవు. కార్డులన్నీ శిథిలాల కిందే ఉండిపోయాయి, ప్రభుత్వ సాయం మా దాకా రావడంలేదు. గంటల తరబడి లైన్​లో నిలుచున్నా ఫుడ్ దొరకట్లే’ అని మాజీ సైనికుడు ఒకరు చెప్పారు. బాత్​రూం వెళ్లాలన్నా లైన్​లో నిలబడాల్సి వస్తున్నది. కొందరు కార్లలోనే పడుకుంటున్నారు. వేరే దేశం వెళ్లిపోదామన్నా.. గుర్తింపు కార్డుల్లేవు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు.

టర్కీకి ఇండియన్​ ఏడో కార్గో విమానం

ఆపరేషన్​ దోస్త్​లో భాగంగా నిత్యావసర వస్తువులతో కూడిన ఇండియన్ ఎయిర్​ఫోర్స్ ఏడో విమానం ఆదివారం అదానాలో ల్యాండ్ అయ్యింది. ఇందులో మందులు, నిత్యావసరాలు పంపించినట్లు మన విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.

నర్సుల ధైర్యానికి హ్యాట్సాఫ్

టర్కీ భూకంపానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నది. హాస్పిటల్ ఐసీయూలో చిన్నారులతో ఉన్న ఇంక్యుబేటర్లు కిందపడకుండా ఇద్దరు నర్సులు గట్టిగా పట్టుకున్నారు. తమ ప్రాణాలను లెక్కజేయకుండా చిన్నారులను కాపాడారు. ఇదంతా గాజియెన్​టెప్​లోని ఓ హాస్పిటల్​ సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. నర్సులు డెవ్లెట్ నిజాం, గజ్వల్ కాలిస్కాన్ ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

మృతులు 29 వేల మంది..

టర్కీ, సిరియాలో మృతుల సంఖ్య 29వేలు దాటింది. టర్కీలోనే 26వేల మందికి పైగా చనిపోగా 80‌‌‌‌‌‌‌‌వేల మంది గాయపడ్డారు. సిరియాలో 4 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో 50 లక్షల మందికి పైగా నిరాశ్రయిలయ్యారు. 2 లక్షల మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. కుప్పకూలిన బిల్డింగ్​లకు సంబంధించిన 113 మందిపై టర్కీ పోలీసులు అరెస్ట్ వారెంట్లు జారీ చేశారు. 12 మందిని కస్టడీలోకి తీసుకున్నారు.