- తెలంగాణ భాష, సంస్కృతిపై మరిన్ని పరిశోధనలు రావాలి: కోదండరాం
- నాటి సమాజానికి సురవరం ప్రతాపరెడ్డి దిశానిర్దేశం: కె. రామచంద్రమూర్తి
హైదరాబాద్ సిటీ, వెలుగు: తెలంగాణ అస్తిత్వాన్ని, భాషా సంస్కృతులను చాటి చెప్పడంలో ‘గోలకొండ పత్రిక’ పోషించిన పాత్ర అద్వితీయమైనదని పలువురు ప్రముఖులు కొనియాడారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా పరిశోధకుడు, సీనియర్ జర్నలిస్ట్ నుగ్గునూతుల యాకయ్య రాసిన ‘గోలకొండ పత్రిక – సాహిత్య సాంస్కృతిక చైతన్యం’ అనే పీహెచ్‌డీ పరిశోధనా గ్రంథ ఆవిష్కరణ సభ ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా సురవరం ప్రతాపరెడ్డి ఫొటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీ తెలుగు భాషా విభాగంలో యాకయ్య ‘గోలకొండ పత్రిక’ పరిశోధన గ్రంథం పూర్తి చేయగా.. సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి ‘గోలకొండ పత్రిక’ సాహిత్య సాంస్కృతిక చైతన్యం పరిశోధన గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం, నాటి సామాజిక పరిస్థితులు, పత్రికా సంపాదకీయాల విశిష్టతపై వక్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
రిటైర్డ్ ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే ఈ ప్రోగ్రాంకు అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. తొలి తెలంగాణ పత్రిక అయిన‘గోలకొండ పత్రిక’పై ఇంతటి లోతైన పరిశోధన జరగడం అభినందనీయమన్నారు. సీనియర్ ఎడిటర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఒక జర్నలిస్టుగా యాకయ్య గ్రామీణ వాతావరణం నుంచి వచ్చి క్షేత్రస్థాయిలో కష్టపడి విలువైన పరిశోధన చేయడం శుభపరిణామన్నారు. పత్రికా ప్రమాణాలు, నైతిక విలువలను పాటిస్తూ సురవరం ప్రతాపరెడ్డి నాటి సమాజానికి దిశానిర్దేశం చేశారని ఆయన గుర్తుచేశారు.
‘గోలకొండ పత్రిక’ కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు: కోదండరాం
మరుగున పడుతున్న తెలంగాణ సాహితీ చరిత్రను ఈ పరిశోధన ద్వారా మళ్లీ రచయిత యాకయ్య వెలుగులోకి తెచ్చారని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కొనియాడారు. 1926 నుంచి తెలంగాణ ప్రతిబింబంగా నిలిచిన ‘గోలకొండ పత్రిక’ సాహిత్యానికే పరిమితం కాకుండా రాజకీయ, సామాజిక విషయాలపై లోతైన ముద్ర వేసిందన్నారు. తెలంగాణ భాషా పరిరక్షణ, రాజకీయ, సామాజిక అంశాలపై మరిన్ని పరిశోధనలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీనియర్ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘తెలంగాణ ఉద్యమ సహేతుకత, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందుకు అని ప్రశ్నించే వారికి ఉద్యమం గురించి చెప్పడం అప్పుడున్న జర్నలిస్టుల అందరి బాధ్యతగా ఉండేది. అలాంటి సమయంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని, ఆంధ్రను కలిపిన సమయంలో ఎలాంటి వక్రీకరణలు జరిగాయి? చెన్నై నుంచి ఆంధ్ర విడిపోయినపుడు ఏం జరిగిందనేది ‘గోలకొండ పత్రికతో పాటు కొన్ని పత్రికల్లో వివరంగా ఉన్నాయి.
పాత పత్రికలు తిరగేయడం వల్ల ఎన్నో విషయాలు తెలిశాయి’ అని ఆయన అన్నారు. పుస్తక సమీక్షకుడు మహేందర్ మాట్లాడుతూ.. ‘గోల్కొండ పత్రిక’లో ఉన్న నాటి సాహిత్యం, కవిత్వం, కథలు వివిధ సాహిత్య విమర్శలపై విస్తృతమైన విశ్లేషణ ఈ గ్రంథంలో ఉందన్నారు. వీ6 వెలుగు స్టేట్ బ్యూరో చీఫ్ చిల్ల మల్లేశం మాట్లాడుతూ.. భాష మీద తెలంగాణ తెలుగు మీద మరిన్ని పరిశోధనలు రావాల్సి ఉందన్నారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుసుకోకుంటే ఎక్కడికి పోతామో తెలియదన్నారు. మన అస్తిత్వం గురించి సాహిత్య, సాంస్కృతిక చరిత్ర గురించి ఈ పుస్తకం ఎంతో తెలియజేస్తుందన్నారు.
పట్టుదలతో పూర్తి చేశా: యాకయ్య
ఈ పరిశోధన గ్రంథం రచించడానికి అనేక మంది జర్నలిస్టులు, ఎడిటర్లు, ప్రొఫెసర్ల విలువైన సూచనలు ఉపయోగపడ్డాయని పుస్తక రచయిత యాకయ్య అన్నారు. 1926 నుంచి ‘గోలకొండ పత్రిక’ లో పబ్లిష్ అయిన సాహిత్యం, సాంస్కృతిక అంశాల సేకరణ సవాలుతో కూడుకున్నదయినా పట్టుదలతో పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. తాను సబ్ ఎడిటర్ గా ఉన్న సమయంలోనే ఈ పరిశోధన చేయడం ప్రారంభించానన్నారు. ఈ సందర్భంగా పరిశోధన గ్రంథాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నట్టు యాకయ్య చెప్పారు. ఈ ప్రోగ్రాంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్‌కు చెందిన జర్నలిస్టులు పాల్గొన్నారు.
తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో నిషేధించిన పార్టీ నాయకుడి విగ్రహం అమీర్ పేట్‌లో పెడతారా?: అల్లం నారాయణ
అసెంబ్లీలో ఒకప్పుడు తెలంగాణ అనే పదాన్ని నిషేధించింది టీడీపీ పార్టీ.. ఇప్పుడు తెలంగాణ అనే పదమే డిక్షనరీలో లేదన్నది ఓ టీడీపీ దళారి.. అలాంటి పార్టీ నాయకుడైన ఎన్టీఆర్ విగ్రహం హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో పెట్టడం ఏంటని మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశ్నించారు. ‘హైదరాబాద్‌లో మొదట రోశయ్య విగ్రహం, తర్వాత ఎస్పీ బాలు విగ్రహం, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి పెట్టించారు.
అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది. 14 ఏండ్లలోనే తెర్లయిన తెలంగాణ చేస్తున్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు ఆంధ్రోళ్ల అనుమతి తీసుకోవాలని చెప్పడం ఎంత వరకు సబబు. బనకచర్ల, కావేరి అనుసంధానికి మీరే సహకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను రాష్ట్ర ప్రజలు గమనించకపోతే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు. పత్రికా స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి చిహ్నం సురవరం ప్రతాపరెడ్డి. గోలకొండ పత్రిక వ్యాపార ధోరణిగా మారిన సమయంలో పత్రికా స్వేచ్ఛ కోల్పోయామనే భావన కలిగినపుడు ఆయన పాత్రికేయుడిగా తప్పుకున్నారు. నాంపల్లిలోని ప్రెస్ అకాడమీకి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలి’ అని అల్లం నారాయణ డిమాండ్ చేశారు.
