గండిపేట, వెలుగు: పైసా పైసా కూడబెట్టుకొని ఇండ్లను నిర్మించుకుంటే వాటిని కూలగొట్టేందుకు ప్రభుత్వం పూనుకోవడం హేయమైన చర్య అని, దీనిని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ ఎదుట శుక్రవారం వారు నిరసన దీక్షకు దిగారు.
అధికారులు, ప్రభుత్వం తమను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరుతో నోటీసులు ఇచ్చి, ఇప్పుడు బఫర్ జోన్ అంటూ కొత్త కథలు అల్లుతూ ఎలాగైనా తమ స్థలాలను కాజేయాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇండ్లను కాపాడుకునేందుకు ప్రాణత్యాగాలకు కూడా సిద్ధమని, అవసరమైతే బుల్డోజర్ల ముందు పడుకుంటామని హెచ్చరించారు. తమ ఇండ్లను కూల్చివేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇక్కడికి వచ్చి తమతో మాట్లాడాలని డిమాండ్ చేశారు.
