ఫైరింగ్ తో భయపడుతున్నాం

ఫైరింగ్ తో భయపడుతున్నాం
  • పీబీఈఎల్ సిటీ అపార్ట్ మెంట్ వాసుల ధర్నా  

ముషీరాబాద్, వెలుగు : ఆర్మీ అగ్నివీరుల  ట్రైనింగ్ లో భాగంగా నిరంతరం కొనసాగుతున్న ఫైరింగ్ శబ్దాలతో  భయాందోళనలో పడ్డామని  పీరం చెరువు విలేజ్ పీబీఈఎల్ సిటీ అపార్ట్ మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో అపార్ట్ మెంట్ వాసులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అపార్ట్ మెంట్  వాసులు వసంతరావు చౌహాన్, అనిల్ కుమార్, నాగరాజు, మురళీమోహన్, శ్రీకాంత్, శైలజ, భారతి, సాంబశివరావు మాట్లాడుతూ గండిపేట్ పరిధి పీరం చెరువు విలేజ్ వద్ద పీబీఈఎల్ సీటీ 15 బ్లాకుల్లో 200 ప్లాట్లతో 7,000 వేల జనాభాతో నివసిస్తున్నామని పేర్కొన్నారు. 

అప్పా జంక్షన్ వద్ద ఉన్న మూసీ ఫైరింగ్ ఆర్మీ రేంజ్ తమ బ్లాక్ లకు దగ్గరగా ఉందన్నారు. దీంతో ఫైరింగ్ రేంజ్ లో జరిగే ట్రైనింగ్ తో పాటు ఫైరింగ్ చేయడంతో భారీగా శబ్దాలు వస్తుండగా చిన్నపిల్లలు, వృద్ధులు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సైబరాబాద్ కమిషనర్, ఎన్విరాన్ మెంట్,​ ఫారెస్ట్ అధికారులు, ఆర్మీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ప్రభుత్వం కూడా స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.