హైదరాబాద్ సిటీ, వెలుగు: చెరువుల పునరుద్ధరణ ప్రోగ్రాంలో మరో నాలుగు చెరువుల అభివృద్ధి పనులకు హైడ్రా గురువారం శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇబ్రహీంబాగ్‌లోని ఇబ్రహీం పెద్ద చెరువు, గండిపేట మండలం పుప్పాలగూడలోని భగీరథమ్మ చెరువు, కూకట్‌పల్లి మండలం మూసాపేటలోని కాముని చెరువు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాప్రాలోని కాప్రా చెరువుల పునరుద్ధరణ పనులను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రారంభించారు.
ఇబ్రహీం పెద్ద చెరువు, కాముని చెరువుల వద్ద భూమిపూజ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. 97 ఎకరాల్లోని ఇబ్రహీం పెద్ద చెరువుకు రూ.29 కోట్లు, 48 ఎకరాల్లో కాముని చెరువుకు రూ.21 కోట్లు, 54 ఎకరాల్లో భగీరథమ్మ చెరువుకు రూ.22 కోట్లు, 112 ఎకరాల్లో కాప్రా చెరువుకు రూ.35 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
