దండం పెడతాం.. బిల్లులు క్లియర్ చేయండి : రిటైర్డ్ ఎంప్లాయిస్

దండం పెడతాం.. బిల్లులు క్లియర్ చేయండి :  రిటైర్డ్ ఎంప్లాయిస్
  • డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ వద్ద రిటైర్డ్​ ఎంప్లాయిస్​ ఆందోళన

హైదరాబాద్, వెలుగు: సచివాలయంలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమ జీవితకాల కష్టార్జితం, చేసిన పనుల బిల్లుల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విసుగుచెందిన రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. తమ బిల్లులు వెంటనే క్లియర్​ చేయాలని డిమాండ్​చేస్తూ డిప్యూటీ సీఎం  మల్లు భట్టి విక్రమార్క చాంబర్ వద్ద పెద్దఎత్తున నినాదాలు చేశారు. 

ఎన్నిసార్లు వచ్చి విన్నవించినా డిప్యూటీ సీఎం గానీ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి గానీ తమను కలవడానికి సమయం ఇవ్వకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  చాంబర్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు ఏండ్ల తరబడి నిలిచిపోవడంతో తమ కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

అధికారులు తక్షణమే చొరవ తీసుకుని నిలిచిపోయిన గ్రాట్యుటీ, జీపీఎఫ్, ఇతర పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్లాది రూపాయల బిల్లుల కోసం అప్పుల పాలయ్యామని కాంట్రాక్టర్లు వాపోయారు. అందరికీ దండం పెడతామని.. తమ బిల్లులను ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలపై స్పందించాల్సిన ఉన్నతాధికారులు మాత్రం  మౌనంగా ఉండటంతో బాధితులు నిరాశతో వెనుదిరిగారు.