విదేశాలకు నై.. క్యాంపస్ కొలువులకు జై.. USAలో రిస్క్ కంటే ఇండియాలో ఉద్యోగమే సేఫ్ అంటున్న స్టూడెంట్లు

విదేశాలకు నై..   క్యాంపస్ కొలువులకు జై.. USAలో రిస్క్ కంటే ఇండియాలో ఉద్యోగమే సేఫ్ అంటున్న స్టూడెంట్లు
  • అమెరికా వీసా రూల్స్, జాబ్ మార్కెట్‌‌‌‌పై తీవ్ర అనిశ్చితి ఎఫెక్ట్ 
  • ఇంజినీరింగ్ కాలేజీల్లో పెరిగిన ప్లేస్‌‌‌‌మెంట్ రిజిస్ట్రేషన్లు 
  • యూఎస్​లో రిస్క్ కంటే ఇండియాలో ఉద్యోగమే సేఫ్ ​అంటున్న స్టూడెంట్లు 
  • మరోవైపు మూడేండ్లుగా క్యాంపస్లకు తగ్గిన కంపెనీల రాక
  • ఆఫర్ లెటర్లిచ్చి హ్యాండిస్తున్న కొన్ని సంస్థలు.. ఆందోళనలో విద్యార్థులు

హైదరాబాద్, వెలుగు: ఇంజినీరింగ్ పట్టా చేతికి రాగానే అప్పులు చేసైనా అమెరికా ఫ్లైట్ ఎక్కేద్దామనుకునే విద్యార్థులు ఇప్పుడు రూట్ మార్చుతున్నారు. విదేశీ ప్రయాణాలను టెంపరరీగా పక్కనపెట్టి, కాలేజీలోనే క్యాంపస్ కొలువును కొట్టేసే పనిలో పడ్డారు. అమెరికాలో వీసా రూల్స్, అంతర్జాతీయ జాబ్ మార్కెట్‌‌‌‌లో నెలకొన్న తీవ్ర అనిశ్చితి వల్ల ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఆందోళన మొదలైంది.

ఎంఎస్​ పేరుతో లక్షల రూపాయలు పోసి విదేశాలకు వెళ్లి ఉద్యోగం రాక అగచాట్లు పడే కంటే.. క్యాంపస్ ఇంటర్వ్యూలలోనే సెలెక్ట్ కావడం సేఫ్ అని భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌‌‌‌మెంట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోపక్క అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో మూడేండ్ల నుంచి క్యాంపస్​లకు కంపెనీలు తగ్గిపోతున్నాయి.

క్యాంపస్ ప్లేస్‌‌‌‌మెంట్లకే మొగ్గు
రాష్ట్రంలో ఏటా లక్షకు పైగా విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు.  ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీలన్నీ క్యాంపస్ రిక్రూట్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసి, సెకండియర్ నుంచే వారిని ఉద్యోగాల కోసం సిద్ధం చేస్తున్నాయి.  బీటెక్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ నుంచే  కాలేజీ యాజమాన్యాలు స్టూడెంట్లను సెలెక్ట్ చేసే పనిలో పడుతున్నాయి. 

ఫైనలియర్ ఫస్ట్ సెమిస్టర్​ నాటికి లిస్టులు రెడీ చేసి.. స్టూడెంట్ల నుంచి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నాయి. కానీ, ప్రతి కాలేజీలో సుమారు 15 నుంచి 25 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలను పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. వాళ్లంతా విదేశాల్లో ఎంఎస్ చేసేందుకు జీఆర్ఈ, ఐఈఎల్టీఎస్, టోఫెల్ లాంటి పరీక్ష లు సిద్ధమవుతుంటారు.

కానీ, ప్రస్తుతం అమెరికాలో సర్కారు మార్పుతో పాటు హెచ్‌‌‌‌-1బీ వంటి వీసా నిబంధనలు మరింత కఠినతరం కావచ్చన్న అంచనాలు విద్యార్థులను పునరాలోచనలో పడేశాయి. దీంతో తొందరపడి అమెరికా వెళ్లి ఇబ్బంది పడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. 

అర్హులైన వారిలో ఏకంగా 95 శాతానికి పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌‌‌‌మెంట్లలో పాల్గొనేందుకు పోటీపడుతున్నారు. ముందు ఇక్కడే 2–3 ఏండ్లు ఉద్యోగం చేసి అనుభవం సంపాదిస్తే.. ఆ తర్వాత విదేశాలకు వెళ్లినా కెరీర్‌‌‌‌కు ఢోకా ఉండదనే పక్కా ప్లాన్‌‌‌‌తో ఉన్నారు. విదేశాల్లో ఎక్కువ జీతం వచ్చినా.. స్వదేశంలో తొలుత రూ.5 లక్షలు ప్యాకేజీలు వచ్చినా బెటర్ అనే భావనలో పడ్డారు. 

మూడేండ్లుగా తగ్గుతున్న క్యాంపస్ ఇంటర్వ్యూలు.. 
విద్యార్థులు పెద్దసంఖ్యలో క్యాంపస్ కొలువుల వైపు చూస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో కంపెనీల తీరు కొంత ఆందోళనకరంగానే మారింది. మూడేండ్లుగా ఇంజినీరింగ్ కాలేజీల్లో రిక్రూట్‌‌‌‌మెంట్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో ఒక్కో కాలేజీకి ప్రాంగణ నియామకాల కోసం 50 నుంచి 80 కంపెనీల దాకా వరుస కట్టేవని.. కానీ, గడిచిన మూడేండ్ల నుంచి కేవలం 20 నుంచి 30 కంపెనీలే వస్తున్నాయని ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చిన కంపెనీల్లోనూ కొన్ని సంస్థలు సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఆఫర్ లెటర్లు చేతిలో పెడుతున్నా.. తీరా విధుల్లో చేరే సమయానికి జాయినింగ్ లెటర్లు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటున్నాయి.

కాగా, ఈ తరహా సమస్య కేవలం సాధారణ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకే పరిమితం కాకుండా, దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లోనూ ఎదురవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి, తీరా జాయినింగ్ విషయంలో కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న దాదాపు 20 ప్రముఖ కంపెనీలను ఐఐటీలు ఇప్పటికే బ్లాక్ లిస్టులో పెట్టేశాయి. ప్రస్తుతం విదేశీ టూర్లు రద్దు చేసుకునే వాళ్లూ క్యాంపస్ ప్లేస్​మెంట్లకు పోటీ పడుతుండటంతో.. ఉద్యోగాలకు భారీగా పోటీ నెలకొన్నదని చెప్పవచ్చు.