అసెంబ్లీ కన్నా జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా.. కేసీఆర్ నన్ను అనేక సార్లు జైలుకు పంపారు: సీఎం రేవంత్

అసెంబ్లీ కన్నా జైలుకే ఎక్కువ సార్లు వెళ్లా.. కేసీఆర్ నన్ను అనేక సార్లు జైలుకు పంపారు: సీఎం రేవంత్
  • 2014 తర్వాత కేసీఆర్, నాకు మధ్యే పోటీ
  • ప్రభుత్వంతో పోరాడాలనే ప్రతిపక్షమైన టీడీపీలో చేరా
  • తొలి నాళ్లలో కాంగ్రెస్ అభ్యర్థులనే ఓడించాను  
  • తెలంగాణ విద్యార్థి రాజకీయాల్లో ఏబీవీపీ, స్టేట్ పాలిటిక్స్లో కాంగ్రెస్ బెస్ట్: సీఎం రేవంత్​రెడ్డి

న్యూఢిల్లీ: "కేసీఆర్ నన్ను అనేకసార్లు జైలుకు పంపారు.. నేను అసెంబ్లీకన్నా జైలుకే ఎక్కువసార్లు వెళ్లా.." అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో అస్సాం దినపత్రిక 'ప్రతిదిన్' నిర్వహించిన కాంక్లేవ్‌‌‌‌లో 'ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్' అంశంపై ఆయన మాట్లాడారు. 

రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల నుంచి తెలంగాణలో పోటీ కేసీఆర్, తన మధ్యే నెలకొందని చెప్పారు. తాను 2006లో జెడ్పీటీసీ సభ్యుడిగా, 2007లో ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచానని రేవంత్ తెలిపారు. ఆ రెండుసార్లూ కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించానన్నారు.

అప్పట్లో జిల్లాలో కాంగ్రెస్, తెలుగుదేశం రెండు పార్టీలే ఉండేవని, కాంగ్రెస్ నేతలతో తనకు పెద్దగా సంబంధాలు లేవని చెప్పారు. ప్రభుత్వంపై పోరాడాలంటే ప్రతిపక్షమే మేలని భావించి తెలుగుదేశంలో చేరానని, ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. 2017లో కాంగ్రెస్‌‌‌‌లో చేరి, 2019లో ఎంపీగా విజయం సాధించానని గుర్తు చేసుకున్నారు.

ప్రజాభీష్టం మేరకే పార్టీ మారా..!
రాష్ట్ర విభజన తర్వాత పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌‌‌‌లో ఉండటంతో తెలంగాణలో తెలుగుదేశానికి ప్రాధాన్యం తగ్గిపోయిందని రేవంత్ అన్నారు. "మీరు మంచి నాయకుడు, నాయుడుతో కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇబ్బంది" అని ప్రజలు తనకు చెప్పారని, దాంతో కాంగ్రెస్‌‌‌‌లో చేరాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. రాహుల్ గాంధీని కలిసిన తర్వాత 15 నిమిషాలు మాట్లాడామని, ఆ రోజే ఆయన తన నాయకుడని నిర్ణయించుకున్నానని రేవంత్ తెలిపారు.

రాహుల్‌‌‌‌కు ఎటువంటి వ్యక్తిగత అజెండాలు లేవని, ఆయనకు దేశమే ముఖ్యమని అన్నారు. తాను విద్యార్థి సంఘంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్నా దేశం, రాష్ట్రం కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతోనే పనిచేశానని వివరించారు. 

రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావమే ఎక్కువ
తెలంగాణలో విద్యార్థి సంఘాలు చాలా తక్కువని, లెఫ్ట్, రైట్ సంఘాలు ఉన్నాయని, ఎన్ఎస్ఐయూ ప్రభావం పెద్దగా లేదని రేవంత్ చెప్పారు.తమ వద్ద యూనివర్సిటీ లా కాలేజ్, ఆర్ట్స్ కాలేజీ నాయకులుగా ఏబీవీపీలో గెలిచిన వారు తర్వాత కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్నారు.

యూనివర్సిటీలో విద్యార్థి సంఘంలో ఉన్నా, గ్రామానికి వెళ్లాక ఆ కుటుంబం కాంగ్రెస్‌‌‌‌లోనే ఉంటుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి పెద్దగా ప్రాధాన్యం లేదని, స్టూడెంట్ రాజకీయాల్లో ఏబీవీపీ ప్రభావం ఉంటే, రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభావం ఉంటుందని అన్నారు.