రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ దానం కన్నుమూత

రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ దానం కన్నుమూత
  • రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ బి.దానం కన్నుమూత 
  • నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస
  • నేడు ఏపీలోని ప్రకాశం జిల్లాలో అంత్యక్రియలు

హైదరాబాద్‌‌, వెలుగు: రిటైర్డ్‌‌ ఐఏఎస్‌‌ అధికారి బొమ్మాజి దానం కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌‌ పంజాగుట్టలోని ఆయన నివాసంలో నిద్రలోనే గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన దానం.. హైదరాబాద్‌‌లో సెటిలయ్యారు. 1971 ఐఏఎస్ బ్యాచ్‌‌కు చెందిన ఆయన శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​గా పనిచేశారు. హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా, కార్యదర్శిగా, పలు హోదాల్లో పనిచేశారు. గృహ నిర్మాణ పథకాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. కార్మిక, ఉపాధి శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీగా పని చేశారు.  తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్‌‌గా ఉన్న టైంలో వేల ఎకరాల భూములను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పంచారు. దళిత, సామాజిక, ఆర్థిక, రాజకీయ ఉద్యమంలో దానం కీలకంగా వ్యవహరించారు. కారంచేడు నుంచి చుండూరు వరకు దళిత ఉద్యమాలకు అండగా నిలిచారు. మాజీ సీఎం చంద్రబాబు తెచ్చిన ఎస్సీ వర్గీకరణ జీవో రద్దుకు పోరాడారు. దానంకు భార్య సరోజిని, నలుగురు కొడుకులు ఉన్నారు. ఆయన కొడుకుల్లో ఒకరు ఆదాయపన్ను శాఖ కమిషనర్‌‌గా, మరొకరు సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా కొనసాగుతున్నారు. దానం అంత్యక్రియలు ప్రకాశం జిల్లా కంభం మండలం పెద్దనల్లగాలువ గ్రామంలో ఆదివారం జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దానం మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దళిత, బహుజనుల బాగు కోసం ఆయన జీవితకాలం కృషిచేశారని సీఎం గుర్తుచేశారు.

బీజేపీ నేత వివేక్ సంతాపం
దానం మృతి దళిత, బహుజనులకు తీరని లోటు అని మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌‌ వెంకటస్వామి అన్నారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించారు. దానం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మాల సంక్షేమ సంఘం స్టేట్‌‌ ప్రెసిడెంట్‌‌ బత్తుల రాంప్రసాద్‌‌ సంతాపం ప్రకటించారు.