- ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిజిటల్ అరెస్ట్
- రూ.90 వేలు కొట్టేసిన కేటుగాళ్లు
ఎల్బీనగర్, వెలుగు: నేరగాళ్లను పట్టుకోవడంలో ఆరితేరిన విశ్రాంత పోలీస్ అధికారి సైతం డిజిటల్ అరెస్టు పేరిట సైబర్ మోసానికి గురయ్యాడు. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ వినోద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మన్సూరాబాద్ హిమపురి కాలనీలో విశ్రాంత ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కంచర్ల సత్యనారాయణరెడ్డి నివాసం ఉంటున్నాడు. గత నెల 28న ఆయనకు ఓ గుర్తు తెలియని యువతి ఫోన్ చేసి తనను తాను సర్కిల్ ఇన్స్పెక్టర్ మేఘనారెడ్డిగా పరిచయం చేసుకుంది.
ఆయన పేరున రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్ ద్వారా సున్నిత సమాచారం ఉగ్రవాదులకు చేరుతోందని, దర్యాప్తు కొనసాగుతోందని భయపెట్టింది. అనంతరం మరో వ్యక్తి సీనియర్ ఆఫీసర్‌గా బెదిరింపులకు గురిచేస్తూ సత్యనారాయణరెడ్డి బ్యాంకు ఖాతా వివరాలతో సహా వ్యక్తిగత సమాచారం సేకరించారు. మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు నకిలీ ఈడీ, ఎన్ఐఏ పత్రాలను బాధితుడికి పంపి తక్షణ అరెస్టు తప్పదని భయం పుట్టించారు.
అరెస్టు నుంచి తప్పించుకోవాలంటే దర్యాప్తులో భాగంగా అకౌంట్నుంచి డబ్బు బదిలీ చేయాలని సూచించారు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు రూ. 98 వేలను ఫోన్ పే ద్వారా పంపారు. ఆ తర్వాత డిజిటల్ అరెస్ట్ స్కామ్‌తో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఏ వంటి సంస్థలు ఫోన్ కాల్స్ ద్వారా వ్యక్తిగత సమాచారం అడగరని, ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉంటూ 1930 హెల్ప్ లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
